ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ కు చెర్రీ ఫ్యాన్స్ డిజప్పాయింట్

దర్శక,నిర్మాతలు గతంలోలాగ ఓ ప్రెస్ మీట్ ఎప్పుడో పెడదాం..మా సినిమా వివరాలు చెప్దాం అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ రోజులు. చాలా స్పీడుగా ప్రతీ విషయం మీదా హీరో అభిమానులకు అప్ డేట్స్ ఇస్తూండాలి. లేకపోతే వాళ్లకు కాలుతుంది. ఎందుకంటే వాళ్లు అంతలా తమ హీరోని ఆరాధిస్తూంటారు…ఆరా తీస్తూంటారు. ఇప్పుడదే మెగా పవర్ తేజ రామ్ చరణ్ విషయంలో జరుగుతోంది.

తాజాగా రామ్ చరణ్, బోయపాటి శ్రీను చిత్రం నిర్మిస్తున్న డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు..ఓ ప్రకటన చేసారు. ఈ సినిమాను ఖచ్చితంగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. షూటింగ్‌ ఆలస్యం కావడంతో విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారాన్ని కొట్టిపారేసింది. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ విడుదల కాబోతోందని సోషల్‌మీడియాలో పేర్కొంది.

అయితే త్వరలో ఫస్ట్ లుక్ అనేదే ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడో ఆ ఫస్ట్ లుక్ అనే డేట్ ఇస్తే తాము హ్యాష్ ట్యాగ్ చేసుకుని దానికోసం ఎదురుచూడటానికి పనికివస్తుందని అంటున్నారు. దాంతో వీరంతా ఉపాసన ని ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ చిత్రం ఫస్ట్ లుక్ ఎప్పుడో చెప్పమని. దాంతో ఈ రోజో ..రేపో ఆ విషయమై ప్రకటన లాంటి ట్వీట్ వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో గ్యాంగ్ లీడర్ సినిమా తరహాలో సాగే చిత్రమిది. ఇద్దరు అన్నల ముద్దుల తమ్ముడుగా చరణ్‌ కనిపిస్తారట. ఆర్యన్‌ రాజేష్‌, వివేక్‌ ఓబెరాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్‌ ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో నటించనున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ మరో హీరో. ఈ చిత్రానికి సంభందించి లాంచింగ్ ఈ వారంలో జరగనుంది.