RRR : ఈ అప్ డేట్ కోసమేగా ఇన్నాళ్ళూ ఎదురుచూసింది

ప్రకటించిన రోజు నుంచి ఎప్పుడెప్పుడా అని అభిమానులు లాంచింగ్ కోసం ఎదురుచూస్తున్న చిత్రం #RRR.ఆ సమయం దగ్గరకు వచ్చేసింది. రాజమౌళి మల్టీ స్టారర్ లాంచింగ్ కు రంగం రెడీ అయ్యింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలయికలో రూపొందనున్న సినిమా పై ప్రారంభించక ముందు నుంచే అంచనాలు క్రియేట్ అవ్వటంతో మరింత జాగ్రత్త కోసం స్క్రిప్టు పై కూర్చున్నారు రాజమౌళి. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం బిజీగా ఉన్నారు. ఆయన ఖాళీ అవటం కోసం ఎదురుచూస్తున్నారు.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తన శరీరాన్ని ఈ సినిమా కోసం మార్పుకోవటం కోసం గంటలు తరబడి జిమ్ లో గడుపుతున్నాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం లాంచింగ్ చేస్తున్నారు. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 5 న ఈ చిత్రం లాంచింగ్ ఫార్మల్ గా జరగనుంది. ఓ ఇరవై రోజుల్లో రెగ్యులర్ షూట్ ప్రారంభం అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పాల్గొననున్నారు. హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫాక్టరీలో వేసిన స్పెషల్ సెట్ లో ఈ షూట్ మొదలెడతారు.


అందుకోసం ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ నేతృత్వంలో అల్యూమినియం ఫ్యాక్టరీని లో సెట్ వేయటం పూర్తైంది. ఈ సినిమా కోసం తారక్ చరణ్ లు ఇద్దరూ వేరే కమిట్మెంట్ లేకుండా దీనికే తమ పూర్తి సమయం కేటాయించబోతున్నారు.దాంతో ఎలాంటి ఒత్తిడి ఉండదు. అలాగే కుమారుడు కార్తికేయ పెళ్ళికి తీసుకునే బ్రేక్ తప్ప రాజమౌళి వచ్చే ఏడాదిలో అధిక కాలం ఈ షూటింగ్ లోనే గడపబోతున్నాడు.

ఎప్పటిలాగే కీరవాణి సంగీతం అందించే ఈ చిత్రానికి సెంథిల్ కెమెరామెన్. మెగా నందమూరి కలయికలో రెడీ అవుతున్న మొదటి మల్టీ స్టారర్ క్రేజ్ కు అడ్డూ అదుపు ఉండదనేది ట్రేడ్ వర్గాల మాట. నిజమే కదా.