జాతీయ అవార్డ్ నటికి మెగా ఆశీస్సులు
ఒక్క కంటి నుంచి నీరు కారాలని దర్శకుడు కోరితే అది చేసి చూపించారు లెజెండ్ సావిత్రి. ఆమెలానే అలానే చేయగలవా? అని అడిగితే నవతరం కథానాయిక కీర్తి సురేష్ చేసి చూపించారంటే తనలోని ప్రతిభను అంచనా వేయొచ్చు. అందుకే ఆ ప్రతిభకు సముచిత గౌరవం దక్కింది. జాతీయ ఉత్తమ నటి గా కీర్తి సురేష్ పేరు మార్మోగుతోంది. `మహానటి` చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుత నటనతో మైమరిపించిన కీర్తి ఆ పురస్కారానికి అన్ని విధాలా అర్హురాలు అన్న చర్చ సాగింది. మహానటి చిత్రానికి మూడు జాతీయ అవార్డులు దక్కడంపైనా ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఇప్పటికీ ఆ సంతోషం కీర్తిని నిలువనీయడం లేదు. పురస్కారం దక్కగానే ఎంతో వినమ్రంగా నాగ్ అశ్విన్- వైజయంతి బృందానికి కృతజ్ఞతలు తెలిపిన కీర్తి.. ఇటీవలే దుబాయ్ లో జరిగిన `సైమా అవార్డుల` వేడుకలో ముఖ్య అతిధి మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్నారు. సైమా -2019 ఉత్సవాల్లో కీర్తి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ అవార్డుల కార్యక్రమంలో సావిత్రిని తలపించేలా ట్రెడిషనల్ శారీలో కీర్తి దర్శనమిచ్చారు.
వేదిక దిగువన గెస్ట్ గ్యాలరీలో మెగాస్టార్ వద్దకు చేరుకుని ఎంతో వినమ్రంగా నవ్వులు చిందిస్తూ కీర్తి సురేష్ ముచ్చట్లాడారు. కీర్తి చేతిని అందుకుని ఎంతో ఆప్యాయంగా మెగాస్టార్ సైతం చిరునవ్వులు చిందిస్తూ తనకు ఆశీస్సులు అందిస్తున్న ఆ దృశ్యం కన్నులపండువగా కనిపిస్తోంది. ఇది యువకథానాయికకు మెగా బ్లెస్సింగ్ అనే చెప్పాలి. అంతా బాగానే ఉంది కానీ ఇప్పటివరకూ కీర్తి సురేష్ కి అజ్ఞాతవాసి ఆఫర్ తప్ప మెగా ఆఫర్లేవీ లేవు. మునుముందు మరి చరణ్- బన్ని లాంటి స్టార్ల సరసన అవకాశం దక్కనుందేమో చూడాలి.