షాకింగ్ : ఉన్నట్లుండి రూట్ మార్చిన కేటిఆర్

కేసిఆర్ కుటుంబంలో పుట్టిన వారంతా గంట కొట్టినట్లే మాట్లాడతారు. కేసిఆర్, కేటిఆర్, కవిత ముగ్గురు ముగ్గురే. కేసిఆర్ మేనల్లుడు హరీష్ కూడా అంతే. మాటల్లో పదును, వేడి, పంచ్ లు ఉంటాయి వీరి స్పీచ్ లో. హరీష్ రావు, కవిత పెద్దగా బూతు భాష వాడిన దాఖలాలు లేవు. కానీ కేసిఆర్ మాత్రం నోరు తెరిస్తే బూతు జాలువారతూ ఉంటుంది. ఆయన మాట్లాడిన వందలాది సభల్లో బూతు లేకుండా ఒక్క ప్రసంగం కూడా ఉండకపోవచ్చు. ఆయన బాటలోనే కేటిఆర్ కూడా నడుస్తున్నారు. వీలైనంత ఎక్కువసార్లు బూతు మాటలు మాట్లాడేందుకే కేటిఆర్ కూడా ఇష్ట పడతారు.

ఇదే కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికైన సంతోష్ రావు ఎలా మాట్లాడతారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన సభలు, సమావేశాల్లో ఎక్కడా మాట్లాడలేదు. మీడియా సమావేశాల్లో కూడా మాట్లాడలేదు. ఆయన ఎంతసేపూ తెర వెనుక టిఆర్ఎస్ ను బలోపేతం చేయడంపైనే ఇప్పటి వరకు పనిచేశారు. ఎంపిగా ఎన్నికై ఆరు నెలలు కావొస్తున్నా సంతోష్ రావు మాత్రం పబ్లిక్ లో మాట్లాడలేదు.

మంగళవారం మధ్యాహ్నం ఇబ్రహింపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి కార్యకర్తల సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు కేటిఆర్ హాజరయ్యారు.  సభలో కేటిఆర్ కంటే ముందు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఆయన ప్రసంగంలో అక్కడక్కడా పరుషమైన పదాలు దొర్లాయి. కానీ 27 నిమిషాల పాటు మాట్లాడిన కేటిఆర్ భాషలో ఎక్కడా గతంలో పోలిస్తే పెద్దగా పరుషమైన పదాలు రాలేదు. తీవ్రమైన పదాలుగా చెప్పుకోవాల్సి వస్తే ‘‘మహా కూటమి పొరపాటున అధికారంలోకి వస్తే జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటది. జుట్టు ఆయన చేతిలో ఉంటే గుండు కొట్టించి సున్నం పూసి పంపుతడు. ఎట్లైతే 60 67 ఏండ్లు తెలంగాణను సంపుక తిన్నడో అట్లే భవిష్యత్తులో కూడా పరిస్థితి ఉంటది’’ అన్నారు కేటిఆర్. ఈ మాటలు తప్ప ఎక్కడా రెచ్చిపోలేదు. 

ఇంకో ఆశ్చర్యకరమైన ముచ్చటేమంటే కోదండరాం ను గతంలో కోదండరాం అనేవారు. లేదంటే కోదండరాం రెడ్డి అనేవారు. కానీ ఇబ్రహింపట్నం సభలో మాత్రం కోదండరాం సార్ అని సంబోధించారు కేటిఆర్. ఒకసారి అంటే ఏదో అనుకోవచ్చు.. కానీ రెండుసార్లు కోదండరాం సార్ అనే మాటనే సంబోధించారాయన. అంతేకాకుండా చంద్రబాబును గురించి మాట్లాడిన సందర్భంలో చంద్రబాబునాయుడు గారు అని ఒకసారి సంబోధించారు. ఇంకోసారి మాత్రం చంద్రబాబునాయుడు అన్నారు.

అమాంతం బూతు భాషను వదిలేసి ఇంత డెమొక్రటిక్ భాషలోకి కేటిఆర్ మారడం సంతోషించదగిన పరిణామంగా చెప్పవచ్చు. మరి కేటిఆర్ ఎందుకు ఇలా సరళ భాషలోకి మారిపోయారన్నది కూడా చర్చనీయాంశమైంది. ఉద్యమ కాలంలో ఒక పోలీసు ఆఫీసర్ ను పట్టుకుని డాష్ కొడకా అంటూ తిట్టారు కేటిఆర్. ఆ తర్వాత అనేక సందర్భాల్లో తిట్టు జాలువారుతూనే ఉన్నాయి.  మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ పిచ్చకుంట్లోడు అంటూ అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. కోదండరాం కు సిగ్గు లేదన్నారు. సోనియా గాంధీని అమ్మ బొమ్మ అన్నారు. చంద్రబాబుపైనా, ఉ్తతమ్ పైనా తిట్ల భాష ప్రయోగించారు. 

కానీ ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. కేసిఆర్ ప్రతిపక్ష నేతలను పట్టుకుని బండబూతులు తిడుతుంటే ప్రతిపక్షాలు కూడా బూతు భాష కు ఎగబడుతున్నాయి. కేసిఆర్ ఒకటంటే నేను నాలుగంటా అని రేవంత్ రెడ్డి బూతుల స్థాయిని అమాంతం పెంచి పచ్చి బూతుల స్థాయికి చేర్చారు. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి భాషలో మాట్లాడతారన్న పేరు ఉండేది. కానీ ఆయన కూడా సిచ్యువేషన్ డిమాండ్ చేయడంతో ఎట్లనోగట్ల బూతు భాష నేర్చుకుని కేసిఆర్ కు కౌంటర్లు ఇచ్చడు షురూ చేశారు. కేసిఆర్ బట్టేబాజ్ సిఎం, డోఖేబాజ్ సిఎం అంటూ ఉత్తమ్ తన స్థాయి తగ్గించుకుని కావాలనే బూతులు మాట్లాడుతున్నారు. 

కేసిఆర్ శిబిరంలో మిగతా మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిల భాష అయితే ఇగ వర్ణనాతీతం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు వారి భాష ఉంది. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెంత తిట్లు తిట్టినా ప్రతిపక్షంలో కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు కానీ ఒక్క జానారెడ్డి మాత్రమే ఇప్పటి వరకు నాలుగున్నరేళ్ల టిఆర్ఎస్ పాలనలో ఒక్క బూతు మాట కూడా మాట్లాడలేదు. టిఆర్ఎస్ బూతు భాష మిగతా కాంగ్రెస్ లీడర్లను టెంప్ట్ చేసినంతగా జానారెడ్డిని టెంప్ట్ చేయలేకపోయింది.

ఇబ్రహింపట్నం సభలో కేటిఆర్ స్టయిల్ మార్చేశారు. మనం ఒకటి అని నాలుగు పడడమెందుకు అనుకున్నారో లేక మరేదైనా కారణముందో తెలియదు కానీ కేటిఆర్ హైలీ ప్రొఫెషనల్ గా మాట్లాడారు. ఎన్నికల్లో ఎవరో ఒకరు గెలుస్తారు. ఒకరు ఓడిపోతారు. రాజకీయాల్లోకి వచ్చిన వారంతా ప్రజల కోసం పనిచేసేందుకే కాబట్టి ఇదే వరవడి ఎన్నికల వరకు కూడా కేటిఆర్ కంటిన్యూ చేస్తే తెలంగాణ రాజకీయాల్లో హుందాతనంతో కూడిన భాష మనుగడలోకి వస్తుందని చెప్పవచ్చు. అప్పుడు ఆ భాష చిన్నపిల్లల మీద ప్రభావం చూపకుండా ఉంటుందని చెప్పక తప్పదు. తెలంగాణ అంటే బూతు భాష కాదు అని నిరూపించే చాన్స్ కూడా ఉంటుంది. 

కొంగర కలాన్ తర్వాత తారా స్థాయికి

కొంగర కలాన్ సభ తర్వాత హుస్నాబాద్, నిజామాబాద్, నల్లగొండలలో కేసిఆర్ బహిరంగసభల్లో మాట్లాడారు. ఆ సభల్లో ఆకాశమే హద్దుగా బూతు పదజాలం వాడారు. పాయకానా పోతుంటే వాసన రాదు.. నాలుగేండ్లు మోదీ సంక నాకినవు కదా? అని చంద్రబాబును తిట్టిపారేశారు. కాంగ్రెస్ నేతలను థూ మీ బతుకులు చెడ అన్నారు. గతంలో మాట్లాడిన మాటల కంటే ఈ మూడు సభల్లో కేసిఆర్ భాషలో బూతు మితిమీరిపోయింది. తారా స్థాయికి చేరింది. ఇప్పుడు కేటిఆర్ పాత భాషను వదిలేయడం శుభ పరిణామంగా అనుకుంటున్నారు. మరి యువ నేత కేసిఆర్ బాటలో టిఆర్ఎస్ లీడర్లంతా నడిస్తే మరీ మంచిది కదా?