విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ‘నోటా’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో విజయ్..ముఖ్యమంత్రిగా.. కనిపించాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ కు ముందు ఇది తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ ఎస్ కు అనుకూలంగా ఉండబోతోందంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమి సరికదా..కేటీఆర్ ని ట్రోల్ చేస్తున్నట్లుగా చాలా మంది భావించారు. అందుకు కారణం ..
ఈ సినిమాలో మూసి నది గురించిన ఓ టాపిక్ ని తీసుకు వచ్చారు. సినిమాలో కేటీఆర్ ని అనుకరిస్తూ హావభావాలు చూపించిన విజయ్…మూసి నది ప్రక్షాళన గురించిన డైలాగులు చెప్పారు. మూడేళ్ల లోగా మూసిని క్లీన్ చేయాలని, అలా చేస్తే ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడగాల్సిన పని ఉండదని, వాళ్లే స్వచ్చందంగా వేస్తారని చెప్పారు. అయితే ఈ డైలాగులు సూటిగా కేటీఆర్ ఉద్దేశించి అన్నట్లే ఉన్నాయంటున్నారు.
ఎందుకంటే మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సబర్మతి నది శుద్ధిని స్ఫూర్తిగా తీసుకుని విడతలవారీగా సుందరీకరణ పనులు చేపడతామని గత రెండు మూడేళ్లుగా .. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్తూనే ఉన్నారు. మురికికూపంగా మారిన ఈ జీవనదికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు రూ.3,000కోట్ల ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి చెప్పారు.
ఇరిగేషన్, టూరిజం, పీసీబీ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ శాఖల సమన్వయంతో మూసీని టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు. అయితే ఇప్పటివరకూ అలాంటిదేమీ జరగలేదు. మరి నోటా సినిమాతో అయినా మూసి వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తుందా చూడాలి.