ఆలా వచ్చే డబ్బుతో నేనేమిచేయాలి – సాయి పల్లవి

సినీ తారలకు ఆదాయ మార్గం సినిమా ఒక్కటే కాదు. కాస్త పేరు, గుర్తింపు వస్తే చాలు… మా ఉత్పత్తులకు ప్రచారం చేసి పెట్టండంటూ కంపెనీలు ఎగబడుతుంటాయి. రూ. కోట్ల కొద్దీ డబ్బు కుమ్మరించడానికి ముందుకొస్తుంటాయి. అలా రెండు చేతులా సంపాదిస్తున్న హీరోయిన్ లు చాలా మందే ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం కొన్ని రకాల ఉత్పత్తులకు ప్రచారం చేయడానికి ఇష్టపడరు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. టాలీవుడ్ ఆడియన్స్ ని ‘ఫిదా’ చేసిన అందం ఈమె సొంతం.

దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సాయి పల్లవికి అభిమానులున్నారు. ఆమె క్రేజ్ ని చూసే సౌందర్య ఉత్పత్తుల కంపెనీలు సాయి పల్లవితో ప్రకటనలు చేయించేందుకు పోటీ పడుతుంటాయి. కానీ ఆమె మాత్రం రూ. కోట్ల కొద్దీ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా సున్నితంగా తిరస్కరిస్తోంది. ‘అలాంటి ప్రకటనలతో వచ్చే డబ్బుతో నేనేం చేయాలి’ అంటోంది. ‘నాకు పెద్దగా అవసరాలు లేవు. సినిమాలతో వచ్చే డబ్బుతో నేను, నా చుట్టూ ఉన్న వాళ్లంతా ఆనందంగా గడుపుతున్నాం. అది చాలు కదా! అయినా రంగు పెరుగుతుంది, అందం పెరుగుతుందని చెప్పడం నా భావాలకి విరుద్ధం” అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి!