మరోసారి వివాదంలో సీతమ్మ
తెలుగు హీరోయిన్ అంజలిని వివాదాలు వెంటాడుతూనే వున్నాయి. సౌత్‌లో క్రేజీ కథానాయికగా పేరు తెచ్చుకుని బిజీ అవుతున్న వేళ ఓ తమిళ దర్శకుడి వివాదంలో చిక్కుకున్న అంజలి ఆ కారణంగా పలు కీలక చిత్రాల్లో నటించే అవకాశాన్ని జారవిడుచుకుంది. దాంతో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలని అంజలి కన్న కలలు ఆవిరైపోయాయి. దాంతో కొంత కాలం సినిమాలకు దూరంగా వుండాల్సి వచ్చింది. అన్న కుదురుకుని మళ్లీ కెరీర్‌ని స్పీడప్ చేయాలనుకుంటున్న వేళ అంజలి చుట్టూ మరో వివాదం అలుముకుంటోంది. అనుమతి లేని ఓ కంపెనీకి అంజలి వాణిజ్య ప్రకటనలు చేస్తోందన్నది తాజా వివాదం.
అంజలి గత కొంత కాలంగా ఓ వంట నూనె కంపెనీకి ప్రచార కర్తగా వ్యవహరిస్తోంది. ఎలాంటి అనుమతులు లేని వంట నూనెకు అంజలి ప్రచార కర్తగా వ్యవహరించడం నచ్చని కోవైకి చెందిన సత్యగాంధీ అనే వ్యక్తి అంజలిపై ఫుడ్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు ఫిర్యాదు చేయడం వివాదంగా మారింది. నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న అంజలి ఇలాంటి ప్రకటనల్లో నటించడం మంచిది కాదని సత్యగాంధీ ఆరోపించారు. దీంతో ఈ వివాదం తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళ మీడియాలో ఈ వివాదం వైరల్ కావడంతో ఆమెతో సినిమాలు నిర్మిస్తున్న వారంతా జాగ్రత్తపడుతున్నారు. దీనిపై అంజలి స్పందించాల్సి వుంది.