దోపిడీకి ఒక్కొక్కరిదీ ఒక్కో మార్గం. కొందరు ప్రజల్ని భయపెట్టి బెంబేలెత్తించి కూడా దోపిడీకి పూనుకుంటారు. పెట్టుబడి దారీ వర్గం కోరలు చాచిన చోట ఈ దందా తప్పదు. ఈ కోవకే చెందుతుంది మెడికల్ కార్పొరెట్ కంపెనీల నిత్య దోపిడీ భోగోతం. ఆస్పత్రుల్లో నిలువు దోపిడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు రాష్ట్రాల్లో కరోనా చికిత్స పేరుతో ఒక్కో పేషెంట్ నుంచి 20లక్షలు గుంజుతున్న వైనంపైనా తీవ్ర విమర్శలు వెల్లువ్తెతుతున్నాయి. మానవత చచ్చిన కార్పొరెట్ ఆస్పత్రుల డాక్టర్లు పేషెంట్ల జీవితాలతో ఆడుకోవడం నిరంతరం మీడియాల సాక్షిగా కంట పడుతూనే ఉంది.
ఒక వృద్ధురాలైన తల్లి తన కళ్ల ముందే చనిపోతున్న టీనేజీ కొడుకును కాపాడుకునేందుకు తానే వైద్యురాలిగా మారి ఆక్సిజన్ పెట్టుకుంటున్న విజువల్ చూసి కంట తడి పెట్టని వాడు లేడు. ఒక తండ్రి తన కొడుకుని బతికించుకునేందుకు ఆస్పత్రికి వెళితే ఆ బిల్లులు కట్టలేక తానే మరణించాడు. కోవిడ్ ఉందని చేరి కార్పొరెట్ ఆస్పత్రుల బిల్లులు చెల్లించలేక అప్పుల పాలై మరణించేవాళ్ల గురించి నిరంతరం వింటూనే ఉన్నాం. ఎందరో చనిపోయిన కోవిడ్ పేషెంట్ల పేర్లు రికార్డుల్లోనే నమోదు కాలేదు. ఈ దారుణాలు ఇంకెన్నాళ్లు? రోజుకు దేశంలో 50 వేల కొత్త పాజిటివ్ కేసులు.. రాష్ట్రాల్లో 10 వేలు పైగా కోవిడ్ కేసులు నమోదవుతుంటే .. దీనికి ఎన్ క్యాష్ చేసుకునేందుకు కార్పొరెట్ ఆస్పత్రులు మెడికల్ చైన్ దందాలు మామూలుగా లేవు. దీనిని మెడికల్ అరాచకం అని అమానవీయత అని అభివర్ణిస్తే తప్పేమీ కాదు.
ఇదిగో రోగం అంటే అదుగో మందు! అన్న తీరుగా దోపిడీకి పాల్పడుతున్నారంతా. మనిషిని మనిషి పీక్కు తినే కల్చర్ అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడ లేదు. రోగులు పెరిగే కొద్దీ టెన్షన్ పెరుగుతోంది. మనిషి భయంతోనే చచ్చే పరిస్థితి నెలకొంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు ఫార్మా కంపెనీ చేస్తున్న దందా కూడా మామూలుగా లేదు.
సన్ ఫార్మాసూటికల్ కంపనీ తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా తీవ్రతను తగ్గించే ఔషధంగా చెబుతున్న ఫావిపిరవిర్ ను అందుబాటులోకి తీసుకొస్తూ.. ట్యాబ్లెట్ ఒక్కొక్కటి రూ.35 బిల్లు వేస్తుందట. ఇంతకుముందే లాంచ్ చేసిన `ఫావిపిరావిర్` ఒక్కో ట్యాబ్లెట్ కి రూ.57 చెల్లించాలని హెటిరో రూల్ పాస్ చేసింది. రూ.57కి ఒక ట్యాబ్లెట్ చెల్లించాలంటే 10 ట్యాబ్లెట్లకు 600 పైగా పెట్టాలి. ఇక అమెరికాకు చెందిన ఓ కంపెనీ రెమిడెసివిర్ ధరను ఒక కోర్సుకి 5000 డాలర్లుగా నిర్ణయించింది. ఇక ఇండియాలో అయితే రెమిడెసివిర్ 5 రోజుల మందుల ప్యాకేజీ ధర రూ.40,000 నుంచి రూ.50,000 కు నిర్ణయించారట.
రూ.10 కే తయారయ్యే ట్యాబ్లెట్ ని దారుణంగా పదింతలు పెంచి అమ్ముతారా? బల్క్ డ్రగ్ తయారీకి అంత ఖర్చు ఎందుకు అవుతుంది? అయినా మెడికల్ మాఫియా దందా ఇప్పుడే కాదు.. ఎప్పుడూ ఇంతే అని విమర్శించేవాళ్లు లేకపోలేదు. పావలా ఖర్చుతో తయారు చేసే విటమిన్ ట్యాబ్లెట్లను రూ.6 నుంచి రూ.10 రూపాయల ధరకు ఒక్కొక్కటి అమ్ముతారని మెడికల్ రెప్ లు చెబుతుంటారు. వండకే దక్కాల్సిన మందుల్ని వేలకు వేలు తగలేయాల్సిన ధైన్నాన్ని మెడికల్ వ్యవస్థ సెట్ చేసి పెట్టింది. ఆస్పత్రికి చెందిన డాక్టర్ గారి మెడికల్ షాపులోనే అన్ని వేలు తగలేయాలన్న వ్యవస్థను తయారు చేసి పెట్టారు. చావుకు దగ్గరగా ఉన్న మనిషికి అమ్మే మెడిసిన్ ధరను పెంచి అమ్మితే తప్పు కాదనేది మెడికల్ మాఫియా మైండ్ సెట్ అని చెబుతుంటారు.
కరోనా ఉందో లేదో కనిపెట్టేందుకే టెస్టుల కోసం రూ.10 వేలు సామాన్యులు పెట్టగలరా? పైగా కరోనా ఉందో లేదో తెలుసుకునేందుకు కరోనా రోగుల క్యూలో నించుని టెస్టులు చేయించుకోవాలట. మనిషిని మనిషి పీక్కు తినే దారుణ వ్యవస్థలో ఉన్నందుకు ఈ శిక్షల్ని అనుభవించాల్సిందేనని అనుకోవాలా? ప్రపంచీకరణ నేపథ్యంలో దారుణ మారణ కాండ ఇదని అనుకోవాలా? పేద బడుగు బక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే దానిని వినోదం చూస్తూ కార్పొరెట్ మెడికల్ మాఫియా ఎంజాయ్ చేస్తుంటుందా? దీనినే కదా పైశాచికానందం అని అంటారు!!
-శివాజీ.కె (సీనియర్ జర్నలిస్ట్)