యంకర్ సుమ కాళ్లపై పడిన రానా

నేచురల్ స్టార్ నానీ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన జెర్సీ చిత్రం ప్రేక్షకుల మన్ననలందుకొంటూ భారీ సక్సెస్ వైపు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా సినిమా యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరుకాగా, చిత్రంలో నటించిన నటీనటులతోపాటు బాల నటుడిగా నటించిన రోనిత్ కమ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానిిక యంకర్ గా వ్యవహరించిన సుమకు, రానాకు మధ్య ఆసక్తికర ఘటన జరిగింది.

కార్యక్రమంలో భాగంగా…. మైక్ అందుకున్న రానా మాట్లాడుతూ…. తనకు క్రికెట్ అన్నా, అమ్మాయిలు, పెళ్లి, పిల్లలు అన్నా పెద్దగా ఆసక్తి ఉండదని తెలిపారు. అలాంటిది జెర్సీ సినిమా చూశాక కంటతడి పెట్టకుండా ఉండలేకపోయానని, ఇక మామూలు ప్రేక్షకుడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.

వెంటనే సుమ అందుకుని మీకు త్వరలోనే అమ్మాయిలు, పెళ్లి, పిల్లల గురించి బాగా అర్థం కావాలని కోరుకుంటున్నాం అనగానే రానా చప్పున వచ్చి సుమ కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేశారు. అది చూసి సుమ కంగారుపడిపోయి కాళ్లు వెనక్కి లాగేసుకున్నారు. రానా నుంచి తప్పించుకునేందుకు వేదికపై పరుగులు పెట్టారు.

అనంతరం, సుమ మాట్లాడుతూ,…అందరూ పెళ్లి చేసుకుని కష్టపడుతుంటే మీరు మాత్రం సుఖంగా ఉండాలా? అందుకే మీరు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కని, అమ్మాయిల మనసు అర్థం చేసుకోవాలి అంటూ రానాను కవ్వించేలా బదులిచ్చారు. ఈ ఎపిసోడ్ కార్యక్రమానికి హాజరైన అందరిని నవ్వించింది. . అంతేకాకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.