ఒక్క పాట‌తో అంద‌ర్నీ ఏకేశావ్‌గా నీకో `దండం` నాయ‌నా…!

 

వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ప్ర‌స్తుత ఏపీ పాలిటిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కించిన చిత్రం `క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు` ఈ చిత్రం మొద‌టి నుంచి వివాదాల పైనే న‌డుస్తుంది. వ‌ర్మ సినిమా రేపు విడ‌ద‌ల‌న‌గా రాత్రికి రాత్రే పేరును మార్చిన విష‌యం కూడా తెలిసిందే. `ల‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు` అన్న పేరు పెట్టినా లోప‌ల కంటెంట్ మాత్రం అలానే ఉంటుంద‌ని కొంద‌రు ఈ చిత్రం విడుద‌ల‌ను అడ్డుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు (నవంబర్ 29న) విడుదల చేయాల్సి ఉంది. కానీ, ఈ సినిమాకు ఇప్పటి వరకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాలేదు. దీనికి తోడు హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. చిత్ర విడుదలకు వీలులేకుండా ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లో సినిమాను చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది.

టైటిల్ విషయంలో కూడా హైకోర్టు సీరియస్ అయ్యింది. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా సినిమా టైటిల్ ఉందని, దాన్ని మార్చాలని సూచించింది. ఇదిలా ఉంటే, ఈ టైటిల్ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు ఒక లేఖ రాసింది. ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్ అఫైర్స్) సజ్జల రామకృష్ణారెడ్డి పేరిట ఈరోజు రీజినల్ సెన్సార్ బోర్డుకు ఒక లేఖ అందింది. చిత్ర టైటిల్‌ను మార్చాల్సిందిగా ఈ లేఖలో రీజినల్ సెన్సార్ ఆఫీసర్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.

రెండు కులాలను లక్ష్యంగా చేస్తూ పెట్టిన ఈ టైటిల్‌ను సామాజిక దృక్పథం కలిగి ఉన్న ఈ సవ్య సమాజం అంగీకరించదు. అందుకని ఈ చిత్ర టైటిల్‌ను మార్చాల్సిందిగా సంబంధిత నిర్మాణ సంస్థకు సూచించాలని కోరుతున్నాం. సినిమా, స్టోరీలైన్, కంటెంట్, అసలు దీనిలో ఏం చూపించారు వంటి విషయాలు పక్కనబెడితే అసలు టైటిలే అంగీకరించలేని విధంగా ఉందని మేం బలంగా నమ్ముతున్నాం. సమాజం అంగీకరించే విధంగా టైటిల్‌ను మార్చాలి. అని ఆ లేఖలో సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.