కరోనా సినిమాల పాలిట శాపంగా మారింది. ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన చిత్రాలన్నీ లాక్‌డౌన్ విధించడంతో అర్థాంతరంగా ఆగిపోయాయి. ఇదిలా వుంటే ఏప్రిల్ 2 నుంచి విడుదల కావాల్సిన సినిమాల రిలీజ్‌లు ఆగిపోవడంతో వాటిపై పుకార్లు మొదలయ్యాయి. ముందుగా రాజ్ తరుణ్ చిత్రం `ఒరేయ్ బుజ్జిగా` ఆన్ లైన్‌లో రిలీజ్ కాబోతోందంటూ పుకార్లు షికారు చేయడం మొదలైంది.
అవన్నీ వట్టి పుకార్లేనని మా చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. రామ్ నటిస్తున్న `రెడ్` చిత్రం ఈ నెల 9న రిలీజ్ కావాల్సి వుంది. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేస్తే భారీ ఆఫర్ ఇస్తామని ఆఫర్ వచ్చిందని వార్తలు మొదలయ్యాయి. దీనిపై స్వయంగా హీరో రామ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తాజాతా ఇదే తరహా వార్తలు అనుష్కపై ఆమె నటించిన సినిమా `నిశ్శబ్దం`పై వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో నటించడమే అనుష్కకు పెద్దగా ఇష్టం లేదని, నామ మాత్రంగానే ఇందులో నటించిందని, సినిమాని ఓటీటీ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు కోన వెంకట్, టి.జి.విశ్వప్రసాద్ ప్లాన్ చేస్తుంటే అనుష్క మాత్రం అది మాత్రం కుదరదంటూ కండీషన్‌లు పెడుతోందని మంగళవారం జోరుగా వార్తలు వినిపించాయి. దీంతో నిర్మాతలు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిన డే వన్ నుంచి అనుష్క, అంజలి, మాధవన్‌తో పాటు ఎంటైర్ టీమ్ సహకరిస్తోందని, ఈ సినిమాపై అనుష్కపై వస్తున్న వన్నీ రూమర్లేనని వివరణ ఇచ్చారు.