జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా ఉగ్ర రూపం దాల్చడంతో సిటీ ఖాళీ అయిపోతున్న సంగతి తెలిసిందే. సిటీలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉండటంతో అంతకు ముందే సొంత రాష్ర్టాలకు, ఇళ్లకు చేరుకునే ప్రయత్నం చేసారు. ఈనేపథ్యంలోనే చాలా వరకూ సిటీ ఖాళీ అయింది. ఇంకొంత మంది సిటీకి దూరంగా ఉన్న ఫామ్ హౌస్ ల్లో తల దాచుకున్నారు. కరోనా తగ్గే వరకూ సిటీ లోపలికి వెళ్లకూడదని….మూడు ,నాలుగు నెలలకు కావాల్సిన నిత్యావసర సరుకులు..ఇతర సామాగ్రిని ఏర్పాటు చేసుకుని ఫామ్ హౌస్ లకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ర్ట సీఎం కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ లో ఉన్నట్లు ప్రచారం సాగింది.
గత 20 రోజులుగా ఆయన కనిపించకపోవడానికి అసలు కారణం ఫామ్ హౌస్ లో ఉండటమేనని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు సైతం ఫామ్ హౌస్ ల బాట పడుతున్నట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి సతీసమేతంగా నార్కట్ పల్లి సమీపంలోని తన ఫామ్ హౌస్ కు చేరుకున్నారుట. కొన్ని నెలలు పాటు అక్కడే ఉండాలని…సిటీ వైపు చూడకూదని సరంజామా అంతా సర్దుకుని ఫామ్ హౌస్ కి చేరుకున్నట్లు తెలుస్తోంది. సిటీలో ఉంటే కరోనాని కోరి తెచ్చుకున్నట్లే అవుతుందని ఇలా బడా బాబులంతా డిసైడ్ అయి ఫామ్ హౌస్ లకు చేరుకుంటున్నారు. ఇంకా పలువురు సెలబ్రిటీలకు హైదరాబా్ సిటీ కి దూరంగా ఫామ్ హౌస్ లు ఉన్నాయి. వాళ్లు కూడా ఇదే బాట పడతారేమో. ఇక సిటీ వదిలి వెళ్లలేని వారు మాత్రం కరోనాతో కలిసి బ్రతకాల్సిందే.
ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలగా `ఆర్ ఆర్ ఆర్` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడ్డ షూటింగ్ మళ్లీ ఇప్పటివరకూ పున ప్రారంభం కాలేదు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కొవిడ్ కి భయపడి ఎవరూ షూటింగ్ చేయలేదు. కొద్ది మంది దర్శకులు ప్రయత్నం చేసి చూసారు. కానీ కరోనా సోకడంతో మళ్లీ ఆపేసారు. దీంతో కరోనాకి వ్యాక్సిన్ వచ్చే వరకూ సినిమా షూటింగ్ లు జరిగే పరిస్థితి లేదని తేలిపోయింది. ఇక థియేటర్లు కూడా అప్పటివరకూ ఎలాగూ తెరవరు.