1978 నుంచి 1980 మధ్యలో ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి , వికాసానికీ ఎంతో కృషి చేశారు . ఇవ్వాళ జూబిలీహిల్స్ లో ఫిలిం నగర్ ఇంత అభివృద్ధి చెందింది అంటే అందుకు చెన్నారెడ్డి గారే కారణం . తెలుగు సినిమా పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ తరలి రావడానికి చెన్నా రెడ్డి గారు సినిమావారి గృహ నిర్మాణము కోసం 100 ఎకరాల స్థలాన్ని ఇచ్చారు .
అలాగే కృష్ణ స్టూడియోస్ కు 10 ఎకరాలు, రామానాయుడు స్టూడియోకు 5 ఎకరాలు , ప్రసాద్ ల్యాబ్ , రాఘవేంద్ర రావు, ఎమ్మెస్ రెడ్డి , చక్రవర్తి తదితరులకు బంజారాహిల్స్ లో స్థలాలు కేటాయించారు . అలా ఆంధ్ర ప్రదేశ్లో సినిమా పరిశ్రమ వేళ్లూనుకోవడాని చెన్నారెడ్డి మార్గం వేశారు . అదే సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థను బలోపేతం చేశారు .
చెన్నారెడ్డి గారి తరువాత వచ్చిన టంగుటూరి అంజయ్య , కోట్ల విజయ భాస్కర రెడ్డి కూడా తెలుగు సినిమా అభివృద్ధికి విశేషమైన కృషి చేశారు . విజయ భాస్కర రెడ్డి హయాంలోనే తెలుగు సినిమాలో పనిచేసే సాంకేతిక నిపుణుల కోసం స్థలాన్ని కేటాయించారు , అదే నేటి చిత్ర పురి కాలనీ .
సినిమా కోసం ఏర్పాటైన కార్పొరేషన్ ఎఫ్ .డి .సి . దీనికి సమర్థులైన వారిని అధ్యక్షులుగా నియమించడం మొదలు పెట్టారు . సినిమాకు సంబందించిన సమస్తం అంటే నంది అవార్డులు, సబ్సిడీలు , షూటింగ్ కు అనుమతులు వగైరా అన్నీ ఈ సంస్థ చూసేది .
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా నందమూరి తారక రామారావు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో నియమితులైన కార్పొరేషన్ అధ్యక్షులు రాజీనామా చేయడం మొదలు పెట్టారు . అప్పుడు ఎఫ్ .డి .సి అధ్యక్షులుగా వున్న డి.కె . సమరసింహా రెడ్డి గారు కూడా తన పదవికి జనవరి 10 1983న రాజీనామా చేశారు . ఆయనకు కార్యాలయ ఉద్యోగులు ,ఎండీ ఎన్ .కె .మురళీధర రావు , ఏ .డి మెయినుద్దీన్ అదేరోజు ఘనంగా వీడ్కోలు చెప్పారు . ఆ సందర్భంగా కార్యాలయంలో చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు . సమరసింహా రెడ్డి గారికి నేనంటే ఎంతో అభిమానం . అందుకే ఆరోజు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు . సమరసింహారెడ్డి చాలా మృదు స్వభావి , స్నేహపాత్రుడు , వారిది మహబూబ్ నగర్ జిల్లా గద్వాల . అంతకు ముందు గద్వాల లో నూతనంగా నిర్మించిన ఓ సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి అక్కినేని నాగేశ్వర రావు గారిని ఆహ్వానించారు . వారితో పాటు రెడ్డి గారు నన్ను కూడా ఆహ్వానించారు . మేము ముగ్గురం హైదరాబాద్ నుంచి గద్వాల ఒకే కారులో వెళ్ళాము . అది మర్చిపోలేని అనుభవం .
సమరసింహారెడ్డి ఎఫ్. డి .సి అధ్యక్షులుగా సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు .చెన్నా రెడ్డి , అంజయ్య , కోట్ల విజయ భాస్కర రెడ్డి మార్గ దర్శకులుగా సమరసింహా రెడ్డి సినిమా రంగం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేశారు.
తెలుగు సినిమా స్వరాష్ట్రం లో స్థిరపడటానికి బీజం వేసి, అభివృద్ధి చెందటానికి చేయూత నిచ్చిన డాక్టర్ చెన్నారెడ్డి స్మృతికి నివాళిగా ఫిలిం నగర్ సొసైటీ ఆవరణలో వారి విగ్రహాన్ని నెలకొల్పారు .
-భగీరథ