(సికిందర్)
‘యూటర్న్’
రచన –దర్శకత్వం : పవన్ కుమార్
తారాగణం : సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక, రవిప్రకాష్ న తదితరులు
సంగీతం : పూర్ణ చంద్ర తేజస్వి, ఛాయాగ్రహణం : నికేత్ బొమ్మి
బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
నిర్మాతలు: శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు
విడుదల : సెప్టెంబర్ 13,2018
మా రేటింగ్ 2.5 / 5
సమంతా రెగ్యులర్ గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, ఇండిపెండెంట్ గా విభిన్న పాత్రలు లు నటిస్తూ కొత్త పంథా తొక్కుతోంది. ‘మహానటి’ లో ఒక జర్నలిస్టు పాత్ర నటించాక మరింకో జర్నలిస్టు పాత్రతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈసారి సస్పన్స్ థ్రిల్లర్ గా రియలిస్టిక్ మూవీని చేపట్టింది. కన్నడ దర్శకుడు తొలిసారిగా తెలుగులో దీన్ని అందిస్తున్నాడు. కన్నడలో హిట్టయిన ‘యూటర్న్’ ని తెలుగు తమిళ భాషల్లో రీమేక్ చేసి ఏకకాలంలో విడుదల చేశాడు దర్శకుడు. మరి ఒరిజినల్ అంత బాగా రీమేక్స్ లో కుదిరిందా లేదా చూద్దాం…
కథ
జర్నలిస్టు రచన (సమంత) ఒక ఫ్లయిఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ ని తొలగించి, యూటర్న్ తీసుకుని ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘిస్తున్న బైక్ రైడర్స్ మీద రిపోర్టింగ్ చేస్తూంటుంది. అలా ఒక బైక్ రైడర్ వివరాలు తెలుసుకుని అతని దగ్గరి కెళ్తే అతను ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కేసులో ఇరుక్కుంటుంది. ఎలాగో బెయిల్ మీద బయటికొచ్చి, పోలీస్ అధికారి నాయక్ (ఆది పినిశెట్టి) తో కలిసి కేసుని పరిశోధిస్తూంటే, యూటర్న్ తీసుకుంటున్న వాళ్ళు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఎందుకిలా జరుగుతోంది? దీని వెనకున్న మిస్టరీ ఏమిటి?… ఇదీ కథ.
ఎలావుంది కథ
ట్రాఫిక్ రూల్స్ పాటించడం పౌర బాధ్యతల కిందికొస్తుంది. పాటించక పోతే జరిగే ప్రమాదాలెలా వుంటాయన్న కాన్సెప్ట్ తో సాగే కథ, చివరికి రూటు మార్చుకుని హార్రర్ జానర్ లోకి తిరగబెట్టడంతో, కథ మౌలిక ఉద్దేశమే దెబ్బతినిపోయింది. ట్రాఫిక్ రూల్స్ ని అతీంద్రియ శక్తులతో ముడిపెట్టడంతో, చూపిస్తున్న వాస్తవిక కథాలక్షణం దెబ్బతిని చేరాల్సిన మెసేజి చేరకుండా పోయింది. మొన్న కొండగట్టు ఘాట్ రోడ్స్ మీద జరిగిన బస్సు ప్రమాదం రూల్స్ ని ఉల్లంఘించిన ఫలితమే. తర్వాత ఆ ప్రాంతలో అరవై కోతులు చనిపోయి కనిపించడంతో, బస్సు ప్రమాదంలో చనిపోయింది కూడా అరవై మందే కాబట్టి, కోతుల్ని చంపినందుకు ఆంజనేయుడు అలా పగదీర్చుకున్నాడని పుకారు లేవదీయడం ఎలా వుందో, ఈ కథలో కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించని వాళ్ళ ఆత్మహత్యలకి ఇలాటిదే కారణం చెప్పడం అలాగే వుంది.
జపాన్లో ఒకడుందే వాడు. వాడు డ్రైవింగ్ లైసెన్స్ పొందడంలో పదేపదే ఫెయిలవుతున్నాడు. దీంతో కావాలనే తనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడంలేదని కక్ష పెట్టుకుని రాత్రిపూట ఆగివున్న కార్ల టైర్లని పంచర్లు చేయసాగాడు. రాత్రైతే చాలు నగరంలో కార్ల టైర్లు చిరిగి పోతున్నాయి. చివరికి ఈ సీరియల్ కార్ కిల్లర్ ఎలాగో దొరికాడు. ఇది వ్యవస్థ మీద పగదీర్చుకున్న వ్యక్తి కథ. అంతే గానీ, వ్యక్తి స్థానంలో అదేదో కనిపించని శక్తి వచ్చి చేయలేదు. ‘యూటర్న్’ కథని ఎలా ముగించాలో అర్ధంగానట్టు ఇంకేదో శక్తికి అంటగట్టి చేతులు దులుపుకున్నారు. ఇలాటి ఆత్మహత్యల పజిల్ ని క్రైం రచయిత్రి ఆగథా క్రిస్టీ అయితే చక్కగా, లాజికల్ గా పరిష్కరిస్తుంది.
ఎవరెలా చేశారు
కన్నడ ఒరిజినల్ లో శ్రద్ధా శ్రీనాథ్ చాలా ఫ్రెష్ గా, యంగ్ గా వుంటుంది. ఆమె ముఖభావాలే పెద్ద ఆకర్షణ. అదామెకు తొలి సినిమా. తెలుగులో సమంత కాస్త మెచ్యూర్డ్ గా కన్పిస్తుంది సీనియారిటీ వల్ల. తెలుగులో నోటెడ్ హీరోయిన్ వుంటేనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కాస్తయినా ఆడతాయి. సమంత వీలయినంత సహజంగా నటించేందుకు ప్రయత్నించింది. ఆది పినిశెట్టి రొటీనే. సీరియస్ పాత్రల్లోనే అతను నటిస్తూ పోతున్నాడు. ఇంకో పాత్రలో భూమిక నటించింది.
దర్శకుడు పవన్ కుమార్ రీమేక్ ని ఒరిజినల్ కి ఏ మాత్రం తగ్గకుండా తీశాడు. అవే ప్రేములు, అవే షాట్లు. కెమెరా, సంగీతం సస్పన్స్ ని, థ్రిల్ ని బాగా ఎలివేట్ చేస్తాయి . ఎడిటింగ్ సైతం బావుంది. సస్పన్స్ థ్రిల్లర్స్ తో రియలిస్టిక్ సినిమాలకి తెలుగు ప్రేక్షకులు ఇంకా అలవాటు పడాలి.
చివరికేమిటి
‘లూసియా’ అనే మొదటి ప్రయత్నంతో అందరి దృష్టిలో పడ్డ కన్నడ దర్శకుడు పవన్ కుమార్ ఈసారి పౌర బాధ్యతలనే సామాజిక సమస్య తీసుకున్నాడు బాగానే వుంది. కానీ ఈ బర్నింగ్ పాయింటు మీద ఏం చెబుతాడా అని ఎదురుచూస్తే, చివర్లో కలిపిన హార్రర్ ముగింపుతో నిరాశ పరుస్తాడు. అలాగే అర్ధంగాని ఇంకో విషయం కూడా వుంది. ఫ్లైఓవర్ మీద అలా డివైడర్ రాళ్ళు తొలగిస్తూంటే ఫోటోలు తీసి పేపర్లో వేసి ట్రాఫిక్ పోలీసుల్ని అప్రమత్తం చేయవచ్చుగా జర్నలిస్టు హీరోయిన్? రెండోది, అసలా రాళ్ళు జరపకుండా సిమెంటు చేయించేస్తే గొడవ వదిలి పోతుందిగా? ఈ రెండూ చేస్తే కథ వుండదనా? కథకోసం కామన్ సెన్స్ ని బలిపెట్టారా?