చంద్రబాబు డైరెక్షన్ తెలంగాణ మహాకూటమిని గట్టెక్కిస్తుందా?

 (యనమల నాగిరెడ్డి)

40 వసంతాల ఇండస్ట్రీ అనుభవంతో, రాజకీయ ఎత్తుగడలు వేయడంలోను, మీడియా మేనేజ్మెంటులో, ప్రచారంలో, పోల్ మానేజ్మెంట్ లో, డాక్టరేట్ సాధించిన చంద్రబాబు, తానే ఏర్పాటుచేసి, కేవలం కనుసైగలతో నపిస్తున్న మ(యా)హాకూటమితో కాంగ్రెస్  ఈ ఎన్నికల్లో  గట్టెక్కుతుందా లేక మునుగుతుందా అన్నది డిసెంబర్ 7 న జరుగునున్న ఎన్నికలు తేల్చనున్నాయి. తెలంగాణా ఎన్నికలలో చంద్రబాబు పాత్రపై విశ్లేషణ.

రాజకీయాలలో తన అవసరాలకోసం ఎలాంటి ఎత్తులు వేయడానికైనా సమర్ధుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బీజేపీతో మొన్నటి వరకు అంటకాగి, ప్రస్తుతం తన మనుగడ కోసం కాంగ్రెసుతో చేతులు కలిపి తెలంగాణా ఎన్నికలలో మహాకూటమిని ఏర్పాటు చేశారు.

ఎత్తుగడలు వేయడంలోనూ,అయిన వారిని అందలం ఎక్కించడంలోనూ, దించడంలోనూ తలలు పండిన కాంగ్రెస్ పార్టీ మహానేతలు అహమ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, కుంతియా లాంటి జాతీయ నాయకులను, తెలంగాణా కాంగ్రెస్ నుండి కాబోయే ముఖ్యమంత్రులుగా కలలు కంటున్న” జానారెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి” లాంటి ఘనులను, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సైతం మాయ చేసి ఈ ఎన్నికలంతా చంద్రమయ చేశారు.  వారిని ప్రస్తుతం తన చిటికెనవేలుపై ఆడిస్తూ, ఎన్నికలలో దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ ఎత్తుగడలు ఫలించి ఈ ఎన్నికలలో మహాకూటమి గట్టెక్కుతుందా? లేదా? అన్న ప్రశ్నలు సాధారణ ఓటర్లతో పాటు, కాంగ్రెస్ నాయకులను కూడా వేధిస్తున్నాయి.

టీడీపీ క్యాడర్ పార్టీకి దూరం

గత నాలుగున్నర సంవత్సరాలకు ముందు తెలంగాణలో టీడీపీకి బలంగా ఉన్న పార్టీ క్యాడర్ ను చంద్రబాబు నాయకత్వం పట్టించుకోలేదు. తెలంగాణాలో ఉన్న రెండవ శ్రేణి నాయకత్వం కూడా వారిని సంరక్షించుకోవడంలో విఫలం కావడంతో ఆ క్యాడర్ మొత్తం పార్టీకి దూరమైంది.

“ఓటుకునోటు కేసులో” ఇరుక్కున్న చంద్రబాబు అమరావతికి వెళ్లిపోవడం, రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడంతో టీడీపీ కార్యకర్తల నైతిక స్థయిర్యం పూర్తిగా దిగజారింది. పార్టీ నుండి తమకు ఎలాంటి రక్షణ దొరకదని భావించిన టీడీపీ కార్యకర్తలు తమకు అనుకూలమైన పార్టీల తీర్థం పుచ్చుకుని ఆయా పార్టీలలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రంగ ప్రవేశం వారిని ఎంతమాత్రం ప్రభావితం చేసి “మహాకూటమికి అనుకూలంగా మారుస్తుందో అనుమానాస్పదమే.

కాంగ్రెస్ లో చంద్రబాబు పెత్తనం పై అంతర్మధనం!

మహాకూటమి ఏర్పాటు, రాహుల్ గాంధీ తో సహా అందరు కాంగ్రెస్ నాయకులపై సాగుతున్న చంద్రబాబు తిరుగులేని పెత్తనం కార్యకర్తలతో పాటు, నాయకులకు కూడా మింగుడు పడటంలేదు. తమ పార్టీ వ్యతిరేకత నుండి పుట్టి తమను అనేక సంవత్సరాలపాటు తమను, పార్టీని నానా పాట్లు పెట్టిన వ్యక్తి తమపై పెత్తనం చెలాయించడం ఏమిటని వారు వాపోతున్నారు. తన రాజకీయ అవసరాలకోసం కాంగ్రెస్ తో కలసిన చంద్రబాబుకు రాహుల్ గాంధీ తో సహా బడా నాయకులంతా గులాంగిరి చేయడం వారిని ఆవేదనకు గురిచేస్తున్నది. తెలంగాణా కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కావడానికి అర్హత ఉన్న నాయకులు 10 నుంచి 12 మంది వరకు ఉన్నారు. జాతీయస్థాయిలో చక్రం తిప్పి తమ కనుసైగలతో ఎంతో మందిని ముఖ్యమంత్రులు గాను, మరి కొంత మందిని ఆ పదవుల నుండి శంకరగిరి మాన్యాలు పట్టించిన ఘనమైన నేతలుండి కూడా చంద్రబాబు ముందు పార్టీని మోకరిల్ల చేయడం ఏమిటని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఎంతో మంది ఘనులుండి కూడా ప్రయోజనం ఏమిటని, ఈ ఎన్నికలను టీడీపీ పొత్తు లేకుండా కాంగ్రెస్ ఒంటరిగానో, లేక తెలంగాణా వాదం తలకెత్తుకున్న వారితోనో కలసి పోటీచేసి ఉంటె మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉండేదని వారు అభిప్రాయం పడుతున్నారు. ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, టిఆర్ఎస్, వైస్సార్ కాంగ్రెస్ లాంటి పార్టీలపై ఈ స్థాయిలో చంద్రబాబు చేస్తున్న కర్రపెత్తనం  సాగుతుందని, జాతీయ పార్టీలపై సాగించడం సాధ్యం కాదని అనేకమంది కాంగ్రెస్ సానుభూతి పరులు అంటున్నారు. కూటమి గెలిచి ఈ స్థితి ఇలాగే సాగితే ఎన్నికల తర్వాత తాము తమ పనుల కోసం బాబు ముందు సాగిలపడక తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు.

కులాల కుంపటి- ప్రాంతీయ విభేదాలు

తెలంగాణలో కాంగ్రెస్ రెడ్డి కులానికి చెందిన పార్టీగా ముద్ర వేసుకోగా, టిఆర్ఎస్ పార్టీకి రెడ్డి కుల వ్యతిరేకిగా ముద్ర పడింది.(వ్యతిరేకులా/ కాదా?అన్నది అక్కడి చర్చనీయాంశం). అయితే టీడీపీ మాత్రం పూర్తి రెడ్డి కుల వ్యతిరేకిగా ముద్రవేసుకున్నది. (ఆంధ్ర ప్రదేశ్ లో కమ్మ పార్టీగా టీడీపీ, రెడ్డి పార్టీగా వైస్సార్ కాంగ్రెస్, కాపు పార్టీ గా జనసేన, సర్వకుల సమ్మేళనగా కాంగ్రెస్ పార్టీ, హిందూ మత పార్టీగా బీజేపీ ముద్ర వేసుకున్నాయి).

ఈ నేపథ్యంలో పూర్తి రెడ్డి కుల వ్యతిరేకిగా ముద్ర వేసుకున్న టీడీపీ కూటమిని నమ్మి ఆ కులం ఈ కూటమితో ప్రయాణిస్తుందా? అలాగే కోస్తా ప్రాంతంలో “ఉప్పు నిప్పుగా” ఉన్న కాపు కులం టీడీపీ నాయకత్వంలోని మహాకూటమికి మద్దతు పలకుతుందా అన్నది కూడా సందేహాస్పదంగా ఉంది.

అలాగే హైదరాబాద్ లోను, తెలంగాణలోనూ నివాసముంటూ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలనుకుంటున్న రాయలసీమ, ఆంధ్ర వారిలో అధికశాతం రెడ్లు, కాపులు ప్రస్తుతం టీడీపీ నాయకత్వంలోని కూటమికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నారు. ప్రస్తుతం తాము ప్రశాంతంగా ఉన్నామని ఈ ఎన్నికలలో చంద్రబాబు మాట మేరకు ఏమి చేసినా తమ ప్రశాంతత కోల్పోవలసి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విభేదాలను తొలగించి వీరిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో “చంద్రబాబు మహాకూటమి” ఎంత మాత్రం విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది.

ఎత్తుగడలు వేయడం- అమలు చేయడం లో సిద్ధహస్తుడు బాబే !

ఎన్నికల రణరంగంలో ఎత్తుగడలు వేయడంలోను, వాటిని ప్రణాళికా బద్దంగా అమలు చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడనడంలో సందేహంలేదు. అందులో భాగంగా ఇప్పటికి పది రోజులకు ముందు వరకు టిఆర్ఎస్ పట్ల ఒక స్థాయి మేరకు వ్యతిరేకత చూపుతున్న బాబు అనుకూల మీడియా (ప్రింట్, ఎలక్ట్రానిక్) ప్రస్తుతం బాబును భుజాన వేసుకుని టిఆర్ఎస్ ను దునుమాడటంలో విజృంభించింది. కాంగ్రేస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ ను కూడా వెనక్కి నెట్టింది. టీవీలలో ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తూ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ప్రత్యర్థిని అయోమయంలో ముంచడంలో నిగ్గు తేలిన బాబు ప్రస్తుతం ఆ పనిలో విజయం సాధించినట్లే. అలాగే సర్వేల పేరుతొ రకరకాల ఫలితాలను ప్రకటింప చేసి ఓటర్లను, ప్రత్యర్థులను అయోమయంలోకి నెట్టడంలో కూడా చంద్రబాబు విజయం సాధించారని చెప్పవచ్చు.

పోల్ మానేజ్మెంట్ లో సిద్ద హస్తులైన తన టీమ్ ను చంద్రబాబు రంగంలోకి దించి, ఆర్థిక, అంగ బలాలను ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణాకు దిగుమతి చేయడం, వారిని “యధోచిత స్థానాలకు” చేర్చడం జరిగిపోయింది. (ఆంధ్రాలో లాగా). పోలింగ్ కు ముందు కార్యకర్తల ద్వారా సక్రమంగా ఓటర్లకు డబ్బు పంచడం, పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తేవడం లాంటి పనులకు అందరిని సిద్ధం చేయడం జరిగి పోయి ఉంటుందంటున్నారు ఆయన అంతేవాసులు.

ఎన్నికలకు కేవలం రెండు రోజులున్న ఈ సమయంలో మహాకూటమికి వ్యతిరేకంగా ఉన్న ఈ అంశాలను సరిదిద్ది కూటమి అభ్యర్థులను విజయ పథంలో నడిపిస్తారా లేదా అన్నది డిసెంబర్ 11 సాయంత్రానికి కానీ తేలదు.