వరంగల్ హోటల్ లో మార్షల్ లా : ఎంతయినా తినండి, పడేస్తే ఫైన్

వరంగల్ అదాలత్‌కు దగ్గరలో ఉన్న లింగాల కేదారి ఫుడ్ కోర్టు అనే సాదాసీదా హోటల్ ఉంది. మంచి భోజనం దొరికే మెస్ లాంటి హోటల్ అది. అని శుచిగా, రుచిగా ఉంటాయి. ఎలాంటి అట్టహాసాలు, బిజినెస్ ట్రిక్కులు లేని నిజాయితీ హోటల్. పేరులోనే నిజాయితీ కనిపిస్తుంది. పాశ్చాత్య దేశాల పేరుతో కాకుండా సాదా సీదా యజమాని పేరునే బ్రాండ్ గా మార్చుకున్న హోటల్ ఇది.

ఫోటో సురేష్ రాసమల్ల ( గూగుల మ్యాప్ నుంచి )


మనకు రకరకాల హోటళ్లు కనిపిస్తుంటాయి. అవన్నీ చాలా అట్టహాసంగా ఉంటాయి.అక్కడ చాలా హడావిడి ఉంటుంది. అది ప్యూర్ భోజనం ఎక్స్ పీరియన్స్ కాదు . భోజనం చేసేందుకుంటే స్టైల్ కోసం అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి  హాటళ్లకు వెళితే  మనం భోజనం మర్చిపోయి, ఇతర ఎక్స్ పిరీయన్స్ లో పడి పోతాం. ప్యూర్ భోజనం చేస్తున్న ఎక్స్ పీరియన్స్ ఇచ్చే హోటళ్లు అరుదు. అలాంటి వాటిలో ఒకటి వరంగల్ లోని  ‘లింగాల కేదారి ఫుడ్ కోర్టు’. దీని యాజమాని లింగాల కేదారి (52).

శుచి, రుచి యే కాదు, భోజనం చేస్తున్న ఎక్ష్ పీరియన్స్ లో సామాజిక బాధ్యతను జోడించిన ఏకైక హోటల్ ఇది. ఢిల్లీలోని కొన్ని హోటల్స్ లో మిగిలిన ఫుడ్ ను ప్యాక్ చేసి మన చేతిలోపెడతారు. ఎందుకని ప్రశ్నించాను. ‘మిగిలిపోయిన ఫుడ్ ను వదిలించుకోవడం చాలా కష్టం, ఖరీదయిన వ్యవహారం. మీ మిగిలిపోయిన ఫుడ్ ను మీకే ప్యాక్ చేసీయడం సులభం, చవక. అంతకు మించి మిగిలిన ఫుడ్ ను హోటల్ లో రేపటి దాకా ఉంచడం చాలా కష్టం. నష్టం కూడా‘ అని చెప్పారు. అయితే,కేదారి ఫుడ్ కోర్ట్ మరొక అడుగు ముందుకేసి భోజనం వృథా కాకుండా మార్షల్ లా విధించింది.

ఈ హోటల్ కు వెళ్తే చాలా సామాజిక బాధ్యతతో వెళ్ళాలి. మీరు ఆర్డర్ చేసిన భోజనం మొత్తం తినాల్సిందే. లేకపోతే శిక్ష ఉంటుంది. ఈ హోటల్ లో ఎంత తినగలరో అంతే బఫెలో వడ్డించుకోవాలి. తీసుకున్నదంతా తినాలి. ఆలా కాదు, ‘మేం కొన్నాం మాయిష్టం . తింటే తింటాం లేదంటే వదిలేస్తాం అంటే కుదరదు. కాదంటే, ఫుడ్ వేస్ట్ ఫైన్ కట్టాల్సి వస్తంది. ఈ నియమాన్ని కఠినంగా అమలుచేస్తూ ఉండటం కేదారి హోటల్ గొప్పతనం. ఇష్టమయితే రండి, కష్టమయితే పోండి అనేది ఈ హోటల్ యజమాని నియమం. ఎవరైనా సరే ఫైన్ రు. 50 కట్టాల్సిందే. ఫైన్ కట్టిన వాళ్ల లోఒక న్యాయమూర్తి, ఒక పోలీసు అధికారి, లెక్కలేనంత మంది ఉద్యోగులు, అధికారులు, చదువుకున్నోళ్లు ఉన్నారు. ఫైన్ కట్టక పోతే, అక్కడి హోటల్ జైలు శిక్ష కూడా ఉంటుంది. ఫైన్ కట్టేంత వరకు అక్కడే కటకటాలలో కూర్చోబెడతారు. అందుకే వడ్డించుకున్నదంతా వూడ్చుకు తినాలి. అయితే, దీనికి అక్కడు గుర్తింపు వుంది. రు. 10 బహుమానం ఉంటుంది.దాదాపు పదిహేనేళ్ల కిందట ఈ మార్ష ల్ లా విధించాడు కేదారి.

లింగాల కేదారి ఫుడ్ కోర్టు ఎలా మొదలయింది

 1990 దశాద్దం నాటి మాట. కుమ్మరి కులానికి చెందిన కేదారి మొదట్లో కుల వృత్తిలోనే ఉంటూ రోడ్ల మీద కుండల వ్యాపారం చేసేవాడు. రోడ్ వెడల్పు చేస్తున్నపుడు ఆయన కుండలమ్మిన జాగా రోడ్డులో కలసి పోయింది. ఇక కుండల జాగా పోవడంతో వృత్తి మారాల్సి వచ్చింది. మొదట తోపుడు బండి మీద తిను బండారాలుఅమ్మేవాడు. తర్వాత స్థిరంగా వ్యాపారం చేసేందుకు తినుబండారాలతోనే చిన్న దుకాణం పెట్టాడు. ఇదే చిన్న హోటలై క్రమంగా ఇప్పటి ‘లింగాల కేదారి ఫుడ్ కోర్టు’ గా మారింది. ఇది బఫే హోటల్ . బుఫే భోజనం 1 గంటలకు మొదలవుతుంది. మూడు గంటలకు ముగుస్తుంది. తిన్నాక, శుభ్రంగా తిన్నవారికి ప్లేట్ అధారంగా రు. 10 రివార్డు ఉంటుంది. రూల్ కఠినంగా ఉన్నా, మధ్యాహ్నం ఒంటిగంటకు ముందే జనం క్యూకడతారు. ఇక్కడికి వచ్చే వారిలో పాత వాళ్లే ఎక్కువ. కొందరు ఫైన్ కట్టిన వాళ్లున్నారు. ‘ రూల్ బాగుంది. మొదట్లో తెలియక ఫైన్ కట్టాను. అది మన మంచికే కదా.తిండి విషయంలో బాధ్యత అవసరం. అందుకే ఈ రూల్ ఉన్నా నేను వరంగల్ వచ్చినపుడల్లా భోజనం చేయాల్సి వస్తే ఇక్కడికే వస్తాను, అని జన్ గాం కు చెందిన దామెర మహేశ్ రెడ్డి అంటున్నాడు.
ఇక్కడ మూడు రకాల శిక్షలున్నాయి. వేస్ట్ చేస్తే రు. 50 జరిమాన. జరిమాన గురించి వాదించి తిట్ల భాష ప్రయోగిస్తే జరిమాన రు. 100 కు పెరుగుతుంది. జరిమాన కట్టకుండా ప్రవర్తన బాగా లేకపోతే రు. 500 ఫైన్. అంగీకరించిన వాళ్లే రావాలి. ఇది రహస్యం కాదు. బోర్డు మీద రాసి అందరికి కనిపించేలా ప్రదర్శించారు కూడా.


ఇలా ఫైన్ వసూలు చేసి, ఆడబ్బును సామాజిక బాధ్యతతోనే ఖర్చు చేస్తాడు. ఆ డబ్బుతో ఆయన బెడ్ షీట్లు దుప్పట్లు కొని పేదలకు, అనాథలకు పంచిపెడుతూ ఉంటారు.

ఈ వేస్టేమిటి? దేశంలో కోట్ల మంది తినడానికి తిండిలేక బతుకుతున్నారు. నాకు వేస్ట్ అంటే ఇష్టం. లేదు. పేపర్ ప్లేట్ లను కూడా నేను పడేయను వాటిని పోయిలోకి వాడతాను అని ఆయన అంటున్నారు.
భోజనం వేస్ట్ చేసినందుకు ఇంతవరకు దాదాపు 300 మందికి ఫైన్ వేశాను. వాళ్లందరి ఫోటోలను నామొబైల్ లో భద్రపరిచాను. ఇందులో ఒక జడ్జి ఉన్నారు, ఎస్ ఐ ఉన్నారు, లెక్కలేనంత మంది గవర్నమెంటాపీసర్లు కూడా ఉన్నారని మొబైల్ చూపిస్తారాయన.

భోజనం కూడా ‘హోమ్ మేడ్’ గా ఉంటుంది. ఆయన భార్య పుష్ఫలత దగ్గరుండి సూపర్ వైజ్ చేస్తుంది. రోజూ దాదాపు 800 మందికి ఈ హోటల్ భోజనం తయారవుతుంది.

‘ మాహోటల్ లో భోజనం ధర రు. 60. తిన్నంత వడ్డిస్తాం. అయితే, వేస్ట్ ను అనుమతించం. ఈ విషయంలో రాజీ లేదు.’ అంటారు కేదారి.


ఈ రోజుల్లో సాదాసీదా భోజనం రు. 80 నుంచి రు100 ధర ఉంటుంది. కానీ కేదారి హోటల్‌లో చేప పులుసుతో పుల్ భోజనం 80/-రూ, మటన్ పుల్ భోజనం 80/-రూ, చికెన్ పుల్ భోజనం 60/-రూ., సాదా పుల్ భోజనం 40/-రూ., పెరుగు అన్నం పుల్ 40/-రూ., చికెన్ బిర్యానీ పుల్ -100/-లభిస్తుంది.