టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. టిఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి టిఆర్ఎస్ కీలక నేతలు రాబోతున్నట్టు తెలిపారు. టిఆర్ఎస్ లో నేతలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వారందరితో తాము ఇప్పటికే చర్చలు జరిపామన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలనను బొంద పెట్టడం ఖాయమన్నారు. టిఆర్ఎస్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీలో కీలక పాత్ర పోషించిన నేతలంతా వస్తున్నారని తెలిపారు. వారందరిని చూసిన తర్వాత కేసీఆర్ కి దిమ్మ తిరగడం ఖాయమన్నారు. వారందరితో చర్చలు పూర్తయ్యాయని కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఆలస్యమన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఏం అన్నారంటే…
ఈ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలంగాణ ప్రజలుగా జరుగుతున్నాయన్నాయి. డిసెంబర్ 11 తర్వాత కేసీఆర్ ఫాం హౌజ్ కు, కేటిఆర్ అమెరికాకు వెళ్లడం ఖాయకం. జనం దృష్టి మరల్చడానికే కేసీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో సీఎం ఎవరైతే కేసీఆర్ కు ఎందుకు. ఈ నాలుగున్నరేళ్లలో ఏం చేశారని మాట్లాడుతున్నావు కేసీఆర్.. సిగ్గుండాలే.. ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించినందుకు శుభాకాంక్షలు. కేసీఆర్ ఇచ్చిన హామీలకు ఈ ఎన్నికలే రిఫరెండమ్.
రాబోయేది మహాకూటమి ప్రభుత్వం. ఏం చేశావని నీవు ఓట్లు అడుగుతున్నావు. దళితుడిని ముఖ్యమంత్రిని చేసినందుకా. డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించినందుకా లేక కేజి టూ పిజి ఇచ్చినందుకా ఏం చేశావని అడుగుతున్నావు. బుద్ది ఉండాలే.. కాంగ్రెస్ ను విమర్శించే ముందు నిన్ను నీవు తెలుసుకొని మాట్లాడు.. అంటూ ఉత్తమ్ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే రెండు ముఖ్యాంశాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అనేక మంది కిరాయి ఇండ్లలో ఉంటన్నారని వారందరి కోసం ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అప్లై చేసుకొని ఉంటారో వారందరికి ఇండ్లు వచ్చేంత వరకు సంవత్సారానికి రూ. 50 వేల రూపాయలు అద్దె చెల్లిస్తామన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పని సమాన వేతనం అమలు చేస్తామన్నారు.
కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఎన్ని చేసినా డిసెంబర్ 12 న ఏర్పడేది ప్రజా కూటమి ప్రభుత్వమన్నారు. డిసెంబర్ 12 న కేసీఆర్ ఫాం హౌజ్ కు, కేటిఆర్ అమెరికాకు వెళతారన్నారు. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఉత్తమ్ విమర్శించారు. దొర అంటే ఎట్టుంటడో చూపించాడని ప్రజలలో కూడా కేసీఆర్ పాలన పై తీవ్ర విమర్శ ఉందన్నారు. జాతీయ సర్వేలు కూడా రాబోయేది ప్రజాకూటమేనని తేల్చి చెప్పాయన్నారు. కేసీఆర్ ఫేక్ సర్వేలతో తన డప్పు తాను కొట్టుకుంటున్నారన్నారు.
బిజెపి నేత మురళీ ధర్ రావు పై ఉత్తమ్ నిప్పులు చెరిగారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటిని ఇప్పించ చేతకానీ వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. మురళీ ధర్ రావుకు సిగ్గుంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడాలని అతని గురించి మాట్లాడి సమయం వృథా అంటూ ఉత్తమ్ ఎద్దేవా చేశారు.
ఉత్తమ్ ప్రకటించిన మరికొన్ని ముఖ్యాంశాలు
ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం
ఉద్యోగులకు 15 రోజుల్లో పీఆర్సీ ఏర్పాటు
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని అద్దె కు ఉంటున్న హైదరాబాద్ వాసులకు సంవత్సరానికి 50 వేల రూపాయల అద్దె చెల్లింపు
సంవత్సరంలో రెండు సార్లు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపు
మేడ్చల్ లో జరిగే సభను అంతా విజయవంతం చేయాలని కోరారు. కూటమిలోని నేతలకు, క్యాడర్ కు ప్రత్యేక ఆహ్వానం పంపామని అంతా తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు.