దుమ్ము దులిపేసిన ఉత్తమ్…

కేసీఆర్ పై టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ సిగ్గు లేకుండా  ఏ ముఖం పెట్టుకొని ప్రజలల్లోకి వెళుతున్నారని విమర్శించారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీలను విమర్శించే హక్కు కేసీఆర్ కు లేదని ఆయన హెచ్చరించారు.  మీట్ ది ప్రెస్ లో  ఆయన ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే…

“కేసీఆర్ హయాంలో అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు జరిగాయి. అనేక సంధర్బాల్లో కేసీఆర్ మీడియాను బెదిరించారు. సర్పంచ్ నుంచి ఎంపీల వరకు అందరిని కొనుకున్నాడు. ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. అధికార దాహంతోనే కేసీఆర్ ఉద్యమాన్ని చేశారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాగ్ధానాలనే టిఆర్ఎస్ మ్యానిఫేస్టోలో పెట్టుకున్నారు. సంవత్సరం కింద నుంచి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి  ఇస్తామని చెబితే తండ్రి కొడుకులు నవ్వారు. దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని విమర్శించారు. ఇప్పుడెలా అమలు చేస్తామంటున్నారు. ప్రజలకు హామీలేలా ఇచ్చారు. గద్దెనెక్కుతూనే కేసీఆర్ జనాలను మోసం చేశారు.

ఇంటింటికి నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడుగా అని చెప్పినవు. ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు కేసీఆర్.. సిగ్గుండాలి.. బట్టేబాజ్ మాటలు ఎందుకు మాట్లాడుతావు కేసీఆర్.. నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. సోనియా కాళ్లు మొక్కితివి… కాపలా కుక్కలా ఉంటానని చెప్పి దోపిడి కుక్కవు అయితివి. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నావ్.. అన్నింటిలో కూడా అవినీతి చేసినవు.

దళితులక మూడు ఎకరాలా భూమి ఎందుకు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూం ఇళ్ల మాట ఏమాయే, కేజీ టూ పీజి ఉచిత విద్య ఏమయింది. తెలంగాణ పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ సక్కగ ఎందుకు ఇవ్వలేదు. తెలంగాణ ధనిక రాష్ట్రామని చెప్పిన కేసీఆర్ సమయానికి రీయింబర్స్ మెంట్ ఎందుకు ఇవ్వలేదు. ఆరోగ్య శ్రీ పథకానికి నిధులేందుకు ఇవ్వలేదు. సన్న బియ్యం పెట్టినం రోడ్డు ఎక్కి ఎవ్వరూ ధర్నాలు చేయలేదని చెప్పుతుర్రు సిగ్గుండాలి… అసలు విడిచిపెట్టి కొసరు చూపిస్తున్నారు.  

కేసీఆర్ కు మోడీని చూస్తే లాగు తడుస్తది. సోనియా గాంధీని సూట్ కేసులు బంద్ అయినయి అందుకే వచ్చింది అంటావు బట్టేబాజ్.. నోరు జాగ్రత్త.. సిగ్గులేదు. నువ్వు సూట్ కేసులు తీసుకున్నోడివి. బ్రోకర్ వి… బ్రోకర్ దందాలు చేసి వచ్చినోడివి. తాగి మాట్లాడుతున్నావా… ఓడిపోతామని ఒణుకు పుట్టి ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు.. రాహుల్ ని లాగు పగిలేదాకా తెలంగాణ దంచుతది అంటావు… నీ లాగు పలగొడుతరు ప్రజలు.. ఖబడ్దార్ చంద్రశేఖర్ రావు.. నీకు దమ్ముంటే తెలంగాణ బిల్లులో ఉన్న హామీలన్ని నెరవేర్చాలని మోదీని ఎందుకు డిమాండ్ చేయలేదు.  తండ్రి కొడుకులు దద్దమ్మలు, సన్నాసులు.. అన్ని లుచ్చా మాటలే మాట్లాడుతున్నారు.

నా గురించి కేసీఆర్ మాట్లాడుతుండు. భారత్ చైనా బార్డర్ ల దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసేందుకు పోరాడి వచ్చిన వాడిని. దొంగ పాస్ పోర్టు దందాలు చేసుకొని బ్రోకర్ గానీ లాగా చేసి వచ్చినోనివి నీవు. తాగి మాట్లాడుతున్నావ్ కేసీఆర్.. జర జాగ్రత్తగా మాట్లాడు. ఎవరి బండారమేందో బయటపడుతది. రాబోయేది మహా కూటమి ప్రభుత్వం. మీ సంగతి చెప్తాం. మీరు తిన్నదంతా కక్కిస్తాం. మాకు పిల్లలు లేరు. తెలంగాణ ప్రజలే తమ పిల్లలు. నీలాగా ఆస్తులు కూడబెట్టి తర్వాతి తరాలకు ఇవ్వాలన్న ఆలోచన నాకు లేదు. అధికార దాహంతో మదమెక్కి ప్రవర్తిస్తున్నారు. కేసీఆర్ పాలనలో అణగారిన వర్గాల వారికి మాట్లాడే అవకాశమే లేదు.

జర్నలిస్టులకు ఇండ్లు కట్టిస్తానని కేసీఆర్ మోసం చేశారు. నానక్ రామ్ గూడలో కోర్టులో పెండింగ్   ఉన్న కేసు ఒక హౌజింగ్ సొసైటికి సంబంధించింది. కానీ కేసీఆర్ అహం, గర్వం బలుపుతోటి జర్నలిస్టులకు ఇండ్లు కేటాయించలేదు. తప్పకుండా మహా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఇండ్లు కేటాయిస్తాం, వారికి  రక్షణ కల్పిస్తాం, వారికి హెల్త్ ప్రీమియం అమలు చేస్తాం. మాట తప్పేంది లేదు. మాట తప్పితే మీరు నన్ను నిలదీయండి.

ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రాబోయేది మహా కూటమి. డిసెంబర్ 12 న ప్రభుత్వం ఏర్పడుతది. కేసీఆర్ ఫాం హౌజ్ కి, కేటిఆర్ అమెరికాకు పారిపోవడం ఖాయం. “  అంటూ ఉత్తమ్ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీల నేతలను ఇష్టమొచ్చినట్టు తిట్టిన కేసీఆర్ కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తున్న ఉత్తమ్ వ్యాఖ్యలతో కూటమి నేతలు, కాంగ్రెస్ శ్రేణులు జోష్ లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.