కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కేసీఆర్ మక్కీకి మక్కీగా కాపీ చేసుకొని వాళ్లు మ్యానిఫెస్టో ప్రకటించిర్రు. ఇంత కన్నా సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉంటుందా అని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. టిఆర్ ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ అని కేసీఆర్ ఒప్పుకొని కాంగ్రెస్ విజయాన్ని ఖాయం చేశారన్నారు.
తండ్రి కొడుకులిద్దరూ నిరుద్యోగ భృతి కాంగ్రెస్ ఇస్తామని ప్రకటిస్తే విమర్శించిర్రు. కేటిఆర్ దక్షిణ భారతదేశంలోనే బడ్జెట్ సరిపోదని విమర్శించారు. మావి తప్పుడు ఆరోపణలన్న కేటిఆర్ ఇప్పుడేం సమాధానం చెబుతారు.
వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు కాంగ్రెస్ పార్టీ పెన్షన్ పెంచుతామని ప్రకటించిన కొన్ని నెలలకు వారు నిద్ర లేచారు. రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. తెలంగాణలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించని ముఖ్యమంత్రి రైతుల గురించి మాట్లాడటం సిగ్గు చేటని ఉత్తమ్ ఫైర్ అయ్యారు.
ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కార్యక్రమాలు అని మాట్లాడుతున్నారు. దగుల్బాజీ, మోసకారి మాట్లాడుతున్నావు కేసీఆర్ అని ఉత్తమ్ విమర్శించారు. ఎస్సీలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మోసం చేసిన పచ్చి మోసగాడు కేసీఆర్ అని ఉత్తమ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పచ్చి అబద్దాల కోరన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు.
పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను కాపీ కొట్టి ప్రకటించారు. సిగ్గుండాలే.. కాంగ్రెస్ పార్టీ పథకాలను ముందుగా ప్రకటిస్తే అవహేళన చేసి మాట్లాడిర్రు. ఇప్పుడు తండ్రి కొడుకులు ఏం సమాధానం చెబుతారని ఉత్తమ్ ప్రశ్నించారు. 40 లక్షల గిరిజనులకు భూమి ఇవ్వలే. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వలేదని ఉత్తమ్ నిలదీశారు. నాలుగేళ్ల టిఆర్ ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్ అన్నారు.
యువతకు కేసీఆర్ మళ్లీ అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ మాట్లాడుతున్న తప్పుడు విషయాలకు ప్రజలు ఆగం కావద్దన్నారు.