టిఆర్ఎస్ నేత దారుణ హత్య

వికారాబాద్ జిల్లాలో మరో టిఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఇటీవల ఓ ప్రేమ వ్యవహరంలో పరిగిలో టిఆర్ఎస్ నేత నారాయణ రెడ్డి దారుణ హత్యకు గురికాగా మంగళవారం రాత్రి పెద్దేముల్ మండలంలో మరో నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఇరు వర్గాల ఘర్షణ నేపథ్యంలో మంబాపూర్ గ్రామానికి చెందిన ప్రసాదరావు దేశ్ ముఖ్ ను ప్రత్యర్దులు కొట్టి చంపారు. అసలు వివరాలు ఏంటంటే…

మంబాపూర్ గ్రామంలో ప్రసాదరావుకు 40 ఎకరాల భూమి ఉంది. వీరి భూమి పక్కకే ద్యావరి శివారెడ్డికి 25 ఎకరాల భూమి ఉంది. చాలా రోజులుగా వీరి మధ్య భూతగాదాలు నడుస్తున్నాయి. శివారెడ్డి భూమికి వెళ్లడానికి బాట లేదు. తరచూ బాట గురించి లొల్లి నడిచేది.

సోమవారం ప్రసాదరావు తన పొలంలో రెండు బోర్లు వేయించాడు. మంగళవారం కూడా బోర్లు వేసే పని కొనసాగింది. అయితే శివారెడ్డి పొలానికి 20 అడుగుల దూరంలోని ప్రసాదరావు భూమిలో నీళ్లు ఫుల్ గా పడ్డాయి. అయితే మా భూమికి దగ్గర బోరు వేస్తే మాకు నీళ్లు రావని శివారెడ్డి, ఆయన సోదరుడు గోపాల్ రెడ్డి ప్రసాదరావుతో గొడవకు దిగారు. ప్రసాదరావు వద్ద పనిచేసే నర్సింహులు, బోర్ వెల్స్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ప్రసాదరావు పై విచక్షణ రహితంగా కట్టెలు, రాళ్లతో దాడి చేశారు. దెబ్బలకు తాళలేక బోరు సమీపంలోనే ప్రసాదరావు ప్రాణాలు వదిలాడు.

ప్రసాదరావు కుటుంబం హైదరాబాద్ లో నివాసం ఉంటోంది. ప్రసాదరావు కూడా వారానికి ఒకసారి గ్రామానికి వచ్చి పోయేవాడు. వ్యవసాయంతో పాటు బిజినెస్ చేసేవాడు. టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో ప్రసాదరావు చురుకుగా పాల్గొనేవాడు. హత్య విషయం తెలిసి  ప్రసాదరావు భార్య రజనీ దేశ్ పాండే, కుమారుడు, కూతురు గ్రామానికి చేరుకొని బోరున విలపించారు.

మంబాపూర్ లో ప్రసాదరావుకు చురుకైన నాయకుడిగా పేరుంది. బిజెపి లో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1996లో ఆయన భార్య రజనీ గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పిల్లల చదువుల కోసం హైదరాబాద్ మకాం మార్చారు. ప్రసాదరావు వారానికి ఓ సారి గ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పూర్తి సమయాన్ని గ్రామంతో పాటు నియోజకవర్గంలో గడిపారని కార్యకర్తలు తెలిపారు. నెలల వ్యవధిలోనే ఇద్దరు టిఆర్ఎస్ నేతలు హత్యకు గురికావడంతో పార్టీలో విషాదం నెలకొంది. 

చిన్న చిన్న వివాదాలకే ప్రాణాలు తీసుకునేంత వరకు రావడం పై అంతా ఆందోళర వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ ఎస్ నేతలు హత్యకు గురవుతుండడంతో పార్టీ శ్రేణులు కలవర పడుతున్నారు. మంబాపూర్ కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి నర్సింహులును విచారించారు. శివారెడ్డి , గోపాల్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో అల్లర్లు జరగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.