గుడ్డు అంటేనే సంపూర్ణ పోషకాల గని. ప్రోటీన్ నుంచి విటమిన్లు, మినరల్స్ వరకు మన శరీరానికి కావాల్సిన చాలా అంశాలు ఒకే గుడ్డులో లభిస్తాయి. అందుకే రోజువారీ ఆహారంలో కనీసం ఒక గుడ్డు అయినా ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. అయితే గుడ్డు ఎంత ఆరోగ్యకరమో, దాన్ని ఎలా తింటున్నామన్నదే అసలు కీలకం. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లే యువతలో పచ్చి గుడ్డును నేరుగా తాగడం ఫ్యాషన్‌లా మారింది. ఇలా చేస్తే ఎనర్జీ ఎక్కువ వస్తుందన్న నమ్మకం ఎంతవరకు నిజమో ఇప్పుడు చూద్దాం.
పచ్చి గుడ్డు తాగడం వల్ల శరీరానికి మేలు కంటే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉడకని గుడ్లలో సాల్మొనెల్లా వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు ఫుడ్ పాయిజనింగ్, జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాల వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పచ్చి గుడ్డులోని తెల్లసొనలో ఉండే ‘అవిడిన్’ అనే ప్రోటీన్ శరీరానికి అవసరమైన బయోటిన్‌ను శోషించకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల జుట్టు, చర్మం, మెటబాలిజంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. గుడ్డును సరైన విధంగా ఉడికిస్తే ఈ సమస్య పూర్తిగా తొలగిపోతుంది.
ప్రోటీన్ శోషణ విషయానికొస్తే పచ్చి గుడ్డును తినడం వల్ల శరీరం కేవలం సగం ప్రోటీన్ మాత్రమే గ్రహించగలుగుతుంది. అదే ఉడికించిన గుడ్డును తింటే 90 శాతం కంటే ఎక్కువ ప్రోటీన్ శరీరానికి అందుతుంది. అయితే గుడ్డును అతిగా ఉడికించడం కూడా మంచిది కాదు. ఎక్కువసేపు మరిగిస్తే గుడ్డు రుచి తగ్గడమే కాదు, కొన్ని ముఖ్యమైన విటమిన్లు కూడా నశిస్తాయి.
అందుకే నిపుణుల సూచన ఏమిటంటే.. గుడ్డు తెల్లసొన పూర్తిగా గట్టిపడే వరకు ఉడికించాలి, పచ్చసొన మాత్రం సాఫ్ట్‌గా లేదా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా వండుకుంటే గుడ్డు రుచిగా ఉండటంతో పాటు శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయి. డైరెక్ట్‌గా పచ్చి గుడ్డు తాగడం కంటే, సరైన విధంగా ఉడకబెట్టుకుని తినడమే నిజమైన సూపర్ ఫుడ్ బెనిఫిట్‌ను ఇస్తుంది.
