తెలంగాణ కేబినేట్ కూర్పు పై అందరిలో ఉత్కంఠ మొదలైంది. మిని కేబినేట్ కూర్పు ఉంటుందన్న సమాచారంతో కీలక నేతలంతా అయోమయంలో పడ్డారని తెలుస్తోంది. మిని కేబినేట్ లో ఎవరికి అవకాశం దక్కుతుందో అని మాజీ మంత్రులు చర్చించుకుంటున్నారు. అయితే జిల్లాల వారీగా మిని కేబినేట్ లో ఎవరికి అవకాశం దక్కుతుందో అని జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో అని అంతా చర్చించుకుంటున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కుతాయని చర్చ జరుగుతోంది. ముందుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కేసీఆర్ కేబినేట్ లో ముందుగా విద్యాశాఖ మంత్రిగా బాద్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కడియం శ్రీహరి మంత్రి వర్గంలోకి రావడంతో జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖను అప్పగించారు. జగదీష్ రెడ్డి సీఎం కేసీఆర్ కు నమ్మిన బంటు. పార్టీ ప్రారంభం నుంచి ఆయన కేసీఆర్ కు వెన్నంటి ఉన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కు నీడలా జగదీష్ రెడ్డి ఉన్నారు. జగదీష్ రెడ్డికి కేసీఆర్ చాలా మంచి అనుబంధం ఉంది. దీంతో జగదీష్ రెడ్డికి రెండో సారి కూడా కేబినేట్ లో బెర్తు ఖాయమని తెలుస్తోంది. మొదటి విడత మంత్రి వర్గంలో నే జగదీష్ రెడ్డికి అవకాశం దక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది.
నల్లగొండ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డికి రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నల్లగొండ ఎంపీగా మరియు రైతు సమన్వయ సమితి సంఘం చైర్మన్ గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. ఆయన మంత్రి కావాలనే ఒప్పందంతోనే టిఆర్ఎస్ లో చేరినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చి రెండో విడతలో కేబినేట్ లోకి తీసుకుంటారని తెలుస్తోంది.
ఆలేరు నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గత ప్రభుత్వంలో విప్ గా పనిచేశారు. ప్రస్తుతం కూడా ఆమెను విప్ గా లేదా డిప్యూటి స్పీకర్ గా నైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. లేని పక్షంలో చీఫ్ విప్ గానైనా గొంగిడి సునీతకు అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాను 3 జిల్లాలుగా చేశారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట. దీంతో సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి, నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, యాదాద్రి నుంచి గొంగిడి సునీతకు అవకాశం ఇవ్వడంతో ముగ్గురికి అవకాశం దక్కినట్టు ఉంటుందని, అన్ని జిల్లాలకు కూడా న్యాయం చేసినట్టు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.