టిఆర్ఎస్ ఎంపీ కొండాతో కేటిఆర్ ఏం చెప్పిండో తెలుసా?

టిఆర్ఎస్ పార్టీని వీడిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో మంత్రి కేటిఆర్  సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడుతారన్న సమాచారం తెలుసుకొని రెండు రోజుల క్రితం రాత్రిపూట కేటిఆర్ విశ్వేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. పార్టీని వీడాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. రాబోయే 15 నుంచి 20 ఏండ్లు తానే సీఎంగా ఉంటానని కేటిఆర్ విశ్వేశ్వర్ రెడ్డితో అన్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏ అవసరం వచ్చినా తాను చూసుకుంటానని చెప్పారని తెలుస్తోంది.

కేటిఆర్ బుజ్జగించినా విశ్వేశ్వర్ రెడ్డి వెనుకకు తగ్గకపోవడంతో మంగళవారం ఉదయం కేటిఆర్ విశ్వేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ప్రచారం చేయాలని ఆదేశించారు. లేకపోతే సస్పెండ్ చేయాలని సీఎం సార్ చెప్పారని కేటిఆర్ విశ్వేశ్వర్ రెడ్డికి చెప్పారు. విశ్వేశ్వర్ రెడ్డి కూడా అంతే ఘాటుగా సస్పెండ్ చేసుకుంటే చేసుకోండని బదులిచ్చారు. సాయంత్రానికి విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చారు.

కేటిఆర్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ తర్వాత సీఎం కేటిఆరే అని స్పష్టమవుతోందని కొందరు టిఆర్ఎస్ నేతల ద్వారా తెలుస్తోంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది కేటిఆర్ కోసమేనన్నా ప్రతిపక్షాల వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కేటిఆర్ ని సీఎం చేసి తాను జాతీయ రాజకీయాలలో చురుకుగా పాల్గొనాలనేది కేసీఆర్ ప్రణాళికగా తెలుస్తోంది. అందుకే ముందస్తు తెచ్చారని, సాధారణ ఎన్నికల సమయంలో నైతే జాతీయ రాజకీయాలలో పాల్గొనే అవకాశం ఉండదు కాబట్టి ముందుగా అసెంబ్లీ  ఎన్నికలకు వెళ్లారని తెలుస్తోంది.  

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ వివిధ పార్టీల నేతలను కలిశారు. అయితే జాతీయ రాజకీయాల  పై ఫోకస్ చేస్తే స్థానికంగా బలహీన పడ వచ్చు అనే ఆలోచనతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని నేతలు తెలిపారు. తెలంగాణ సాధించి రాష్ట్రాన్ని ఏర్పరుచుకున్నవాళ్లం, ఢిల్లీని కూడా ఏలాల్సిన సమయం ఆసన్నమైందని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశానికి పట్టిన శని కాంగ్రెస్ , బిజెపిలని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న తరుణంలో తెలంగాణే కాదు దేశాన్ని మార్చుకోవాల్సిన అవసరముందన్నారు. జాతీయ రాజకీయాలలోకి వచ్చే ఎత్తుగడలలో భాగంగానే ఆయన ముందస్తుకు వెళ్లారని స్పష్టమవుతోంది.

ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ కు రాజీనామా చేసి షాకిచ్చిన చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కోదండరాం పిలుపుతో ఉద్యమంలో చేరానని కానీ ఈనాడు ఉద్యమంలో పాల్గొనని వారికి విలువిచ్చి ఉద్యమకారులను అవమాన పరిచారన్నారు. తన వ్యాపారాలు, రీసెర్చీలు పక్కకు పెట్టి ఉద్యమంలో పాల్గొన్నానన్నారు.

కేసీఆర్ నాయకత్వాన పార్టీలో చేరి ఎంపీ గా ఎన్నికయ్యానన్నారు. తాను ఎంపీగా ఉండి కనీసం మురికి కాల్వలను కూడా శుభ్రం చేయించుకోలేని పరిస్థితిలో రాజకీయాలు నడిచాయన్నారు. ప్రజల క్షేమం కోసమే తాను నిర్ణయం తీసుకుంటున్నానన్నారు. తాండూర్ లో అయూబ్ ఖాన్ పెట్రోల్ పోసుకొని చనిపోయిన ఘటన చాలా బాధించిందన్నారు.

టిఆర్ఎస్ పార్టీలో ఎంపీలకు అసలు విలువలేదన్నారు. తాము కీలు బొమ్మలుగా మిగిలిపోయామన్నారు. ఎమ్మెల్యేలకు ఇచ్చిన విలువ కూడా తమకు లేకుండా పోయిందన్నారు. స్వంత నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకోలేని స్థాయికి దిగజారామన్నారు. చేవేళ్లలో కళాశాలలు లేవు, పరిశ్రమలు రాలేదన్నారు. నిరుద్యోగంతో యువత అల్లాడుతున్నారని నియోజకవర్గంలో యువకులను చూసినప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక చాలా సార్లు సతమతమయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో జరుగుతది అనుకున్న తెలంగాణలో ఏదేదో జరుగుతుందని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. 

 

విశ్వేశ్వర్ రెడ్డి ఏం మాట్లాడారో వీడియోలో ఉంది చూడండి.

 

konda vishweshwar reddy