Notices To KCR: కేసీఆర్‌కు నోటీసులు.. కేటీఆర్ ఏమన్నారంటే..?

కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు రావడం రాజకీయ వేడి పెంచింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నోటీసులు జారీ చేయగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకే మొగ్గు చూపుతోందని, ప్రజా సమస్యలపైన దృష్టి లేదని విమర్శలు గుప్పించారు. గత 17 నెలల పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారని అన్నారు.

కేటీఆర్ మాటల్లో చాలా ఆగ్రహం కనిపించింది. “కమీషన్లే పాలనలా మారాయి. కాంగ్రెస్ నేతలే చెప్పుతున్నారు.. కమీషన్ లేకుండా ఒక్క పని జరగడం లేదు. రాష్ట్రంలో ఈ దుస్థితిని చూస్తే బాధ కలుగుతోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం, సుంకిశాల ప్రాజెక్ట్ కూలిన ఘటనలపై కూడా ప్రభుత్వం స్పందించలేకపోయిందని విమర్శించారు. సహాయక చర్యలు కూడా సరిగా చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.

ఈ నోటీసులు కేవలం ప్రజల మద్దతు కోల్పోతున్న కాంగ్రెస్ నాయకత్వం చేసిన ప్రయత్నమేనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. “మీరు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి? బంగారం తులం ఇచ్చామంటారా? నాలుగు వేల రూపాయల పింఛను ఇచ్చారా?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. చట్టపరంగా తాము సిద్ధంగా ఉన్నామని, చివరికి నిజాయతీ గెలుస్తుందన్న నమ్మకం తమకుందన్నారు. ఈ చర్యలు తమపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టంగా చెప్పేశారు.