హైదరాబాద్: ఎఫ్టీసీసీఐ ఎక్సలెన్సీ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన కేటీఆర్.. కేంద్రం తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యాపార.. వాణిజ్య.. నైపుణ్య రంగాలతో సహా అన్ని రంగాల్లోనూ.. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం మొదటి మూడు స్థానాల్లో ఉందని.. కానీ పథకాలు.. ప్రాజెక్టులు.. బుల్లెట్ ట్రైన్లు ఉత్తరాదికి మాత్రమే పరిమితమవుతున్నాయని విమర్శించారు. ‘బుల్లెట్ ట్రైన్లు.. హైస్పీడ్ రైళ్లు అన్ని గుజరాత్.. ఢిల్లీ.. ముంబయి ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయి. ఆత్మనిర్భర్ వల్ల ఎవరికి లబ్థి చేకూరిందో తెలీదు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో తెలీదు’ అంటూ వేయాల్సిన ప్రశ్నల్ని కేంద్ర ప్రభుత్వానికి సంధించారు.
దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తుందని.. కేంద్ర పథకాలు దక్షిణాదికి రావటం లేదన్న ఆయన.. ప్రధాని మోడీ నోటి వెంట తరచూ వచ్చే సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ మాటలకు చేతలకు ఏ మాత్రం సంబంధం లేదన్న విషయాన్ని ఆయన ఉదాహరణలతో సహా ప్రశ్నించినట్లుగా చెప్పక తప్పదు. మరి.. మంత్రి కేటీఆర్ మాటలకు తెలంగాణ బీజేపీ నేతలు ఏమని బదులిస్తారో చూడాలి.