ఓడిపోయిన తర్వాత కోమటిరెడ్డి ఏం చేస్తుండంటే ? (వీడియోలు)

తెలంగాణ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ మహా వృక్షాలు నేలకూలాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రముఖులు ఓడిపోయారు. అలాంటివారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు. నిన్నటి వరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమెరుగని నాయకుడు. ఆయన రాజకీయాల్లో తొలిసారి ఓటమిపాలయ్యారు. తన ప్రత్యర్థి టిఆర్ఎస్ నేత భూపాల్ రెడ్డి చేతిలో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన ఏమాత్రం మానసిక ఆందోళనకు గురికాలేదు. జిమ్ లో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. 

రాజకీయాల్లో గెలుపోటములు సహజం అనుకున్నారు. ఫలితాలు వచ్చిన తెల్లారే తన దైనందిన జీవితంలో హుషారుగా సాగిపోతున్నారు. గెలిచినా ఓడినా ప్రజా జీవితంలోనే ఉంటానని బుధవారం స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గత 20 యేండ్లు గా తనను ఎమ్మెల్యే గా ఎన్నుకున్న ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారని అన్నారు కోమటిరెడ్డి. రోజువారిలాగే తన దినచర్య ను కొనసాగిస్తున్నారు మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఉదయం హైద్రాబాద్ లో జిమ్ కి వెళ్లి ఉల్లాసంగా అందరితో కలిసి జిమ్ చేశారు.  కోమటిరెడ్డి జిమ్ చేస్తున్న వీడియోలు కింద ఉన్నాయి చూడొచ్చు.

 

 

 

రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వాళ్లు గెలుస్తారు. కొమ్ములు తిరిగిన రాజకీయ నేతలు కొన్నిసార్లు ఓటమి రుచి చూస్తారు. కానీ ఓటమెరుగని నాయకులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరు. వైఎస్ పోటీ చేసిన ఏ ఎన్నికలోనూ ఓటమి అనేది తెలియకుండా గెలిచారు. ఆ తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే.

తెలంగాణ ఎన్నికల్లో చూస్తే ఓటమెరుగని నాయకులుగా హరీష్ రావు, కేటిఆర్, కవిత ఈటల రాజేందర్ లాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా నిన్నటి వరకు ఓటమెరుగని నాయకుడే. కానీ ఈసారి ఎన్నికల్లో ఆయన తొలిసారి ఓటమిని చవిచూశారు. 

కోమటిరెడ్డిపై కొందరి పైశాచికం..

ఎన్నికల ఫలితాలు వస్తున్నవేళ కొందరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. ఫలితాలు కోమటిరెడ్డికి అనుకూలంగా రాకపోవడంతో ఆయన మూర్చపడిపోయారని ఒక ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆయనను ఆసుపత్రికి తరలించారని, ఆయనను పరామర్శించేందుకు తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ వస్తున్నాడని కూడా కామెంట్స్ చేశారు. అయితే అదంతా ఉత్తదే అని బుధవారం నిరూపించారు కోమటిరెడ్డి.

ఓడిపోయానన్న బాధ ఉన్నప్పటికీ తాను జిమ్ చేస్తూ ఆ వీడియోలను తన అభిమానులకు పంపించారు. మర దారుణమైన విషయం ఏమంటే… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పడిపోయిన ఫొటో ఇప్పటిది కాదు. తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన సమయంలో మరణ వార్త విని ఆయన కుప్పకూలిపోయారు. ఆనాటి ఫొటోను ఇప్పుటిదిగా వైరల్ చేశారు కొందరు ప్రత్యర్థులు. అలాంటి వారికి కోమటిరెడ్డి చెంపపెట్టులాంటి కార్యాచరణకు దిగారని ఆయన సన్నిహితులు కామెంట్ చేశారు.