కేసీఆర్ అంటే రాజకీయం, రాజకీయం అంటే కేసీఆర్. ఆయన వేసే ఎత్తుగడలు, ఫాలో అయ్యే వ్యూహాలు చాలా పదునుగా ఉంటాయి. వాటిని ప్రత్యర్థుల మీద, ప్రతికూల పరిస్థితుల మీదే కాదు అప్పుడప్పుడు ప్రజల మీద కూడ ప్రయోగిస్తుంటారాయన. త్వరలో గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మరోసారి స్వీప్ చేయాలనేది కేసీఆర్ లక్ష్యం. అందుకే కసరత్తులు స్టార్ట్ చేశారు. బాధ్యతలు మొత్తం తనయుడు, మంత్రి కేటీఆర్ మీదనే పెట్టినట్టు, తానేమీ పట్టించుకోనట్టు కనిపిస్తున్న ఆయన చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నారు. పనులంటే జనం మధ్యలోకి వచ్చి చేసేవి కావు జనంలో స్థిరపడిపోయే పనులు. అవే నోటి మాటలు.
ఏం మాట్లాడినా ధీమాగా మాట్లాడే కేసీఆర్ బల్దియా ఎన్నికల్లో తెరాస పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని స్టెట్మెంట్ ఇచ్ఛేశారు. తాము 99 నుండి 104 స్థానాల్లో గెలుస్తామని ప్రకటించారు. ఈ లెక్కలు ఏదో నోటి మాటగా చెబుతున్నవి కాదట పలు సర్వేలు చేయించి చెబుతున్నవట. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పలు సంస్థల చేత సర్వే నిర్వహించారట ఆయన. ఆ సర్వేలన్నింటిలో తాము 100కి పైగా స్థానాలని కైవసం చేసుకుంటామని వెల్లడైనట్టు చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కడా కనబడదని, ఉన్న సీట్లు కూడ పోగొట్టుకుంటుందని అన్నారు. ఇక బీజేపీ అయితే ఒకటో రెండో సీట్లు పెంచుకోవచ్చని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ నోటి వెంట వచ్చిన మంత్రాల్లాంటి ఈ మాటలు సామాన్యమైనవేమీ కాదు. అవి ప్రజల మైండ్ సెట్మార్చే మాటలు. ఇక తెరాస అనుకూల మీడియా మొత్తం గ్రేటర్లో విజయకేతనం ఎగురవేయనున్న తెరాస, 100కి పైగా కార్పొరేషన్ స్థానాలు వారివే, కారు జోరు అంటూ హైప్ క్రియేట్ చేయడం మొదలెడుతుంది. ఇవన్నీ ప్రజల్లో అంటే ఈసారి కూడా తెరాసదే గ్రేటర్లో పైచేయన్నమాట అనే అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఎన్నికల ఫలితాలను గొప్పగా ప్రభావితం చేస్తుంది. మరోవైపు కేటీఆర్ సిటీ మొత్తం తిరుగుతూ అభివృద్ది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సిటీలో మొత్తం హడావుడి ఆయనదే. సో.. గ్రేటర్ వ్యూహల అమలు ఎప్పుడో మొదలైందని మనం అర్థం చేసుకోవచ్చు.