ఒకప్పుడు కేసీఆర్ అంటే ఆ లెవల్ వేరుగా ఉండేది. ప్రత్యర్థి అనే వాడే లేకుండా రాజకీయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి అని గొప్పగా చెప్పుకునేవారు జనం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన్ను ఓడించడం ఎవ్వరి తరమూ కాదన్నట్టు ఉండేది పరిస్థితి. కానీ మెల్లగా పరిస్థితులు మారిపోయాయి. కేసీఆర్ పదవీ గండం భయం పట్టుకుంది. దీంతో ఇన్నాళ్లు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ లోపం వల్లనే ఆయన వెలిగిపోతూ వచ్చారని, సరైన ఆపొనెంట్ తగిలితే కదిలిపోతారని రుజువు చేసింది బీజేపీ. లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యం విజయాలు, దుబ్బాకలో మరుపురాని గెలుపు, గ్రేటర్ ఎన్నికల్లో కారు గాలి తీసేయడం లాంటి పరిణామాలతో శక్తిని పుంజుకుంది. ఇప్పుడు బీజేపీ అంటే రాష్ట్రంలో, ప్రజల్లో ఒక స్థాయి ఏర్పడిపోయింది.
గతంలో కేసీఆర్ ప్రతిపక్షాల పేరెత్తితే అవి అసలు పార్టీలే కాదన్నంత చులకనగా మాట్లాడేవారు. కేసీఆర్ ను ఢీకొట్టడం వారి తరం కాదన్నట్టు వ్యవహరించేవారు. బీజేపీ ఇచ్చిన వరుస షాకులతో ఆ మబ్బులన్నీ తొలగిపోయి ఒకప్పటిలా బాధ్యతలను నెత్తికెత్తుకోవాలని గ్రహించారు. నిన్న మొన్నటి వరకు ఇకపై రాష్ట్రాన్ని కుమారుడి చేతిలో పెట్టేసి ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పాలని ఆశపడ్డారు, ఇప్పడేమో రాష్ట్రం దాటితే తిరిగి చూసే లోపు బీజేపీ ఏం చేస్తుందో, ఎలా రేగిపోతుందోననే భయం పట్టుకుంది. సార్వత్రిక ఎన్నికల విషయంలో కంగారు మొదలైపోయింది. ఇది చాలదన్నట్టు ఎన్నికలు జమిలి రూపంలో ముందుకే వస్తాయనే సూచనలు ఆయన్ను మరింత బెదరగొట్టేస్తున్నాయట.
మోదీ జమిలి ఎన్నికలకు వెళ్లి ఒకే ఎన్నిక ఒకే అధ్యక్షుడు అనే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని ఉవ్విళూరుతున్నారు. అన్ని రాష్ట్రాల ఎన్నికల కాల పరిమితికి జమిలి సెట్టవ్వకపోయినా అవసరమైన చోట్ల ప్రభుత్వాల పదవీ కాలాన్ని అడ్జెస్ట్ చేసి 2022కు జమిలికి దూకాలని చూస్తున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించే పనిలో ఉన్నారు. అన్నీ కలిసొస్తే ఆయన అనుకున్నట్టే జరగవచ్చు. ఇటీవల కేటీఆర్ సైతం జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించడం పార్టీ వర్గాలను ఆలోచనలో పడేసింది, అంటే జమిలి వాతావరణం ఉందనేది వాస్తవమని అర్థమవుతూనే ఉంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలే గనుక ముందుకొస్తే కేసీఆర్ కు కష్టమే. ప్రజల్లో తమ పాలన పట్ల వ్యతిరేకత ఉందని స్పష్టంగా తెలిసిపోయింది. రాష్ట్రం మొత్తం ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. దాని నుండి బయటపడటం అంత సులభమైన పని కాదు. ఎంత కష్టపడినా ప్రజల్ని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇక బీజేపీ గెలిచిన ఊపులో ఉంది. ఎన్నికలే ముందుకొస్తే అదే ఉత్సాహం కంటిన్యూ చేస్తారు వాళ్ళు. ఈ చిన్న గ్యాప్లో ఒకేసారి వారిని నిలువరించడం, పార్టీని పుంజుకునేలా చేయడం కష్టం. ఏదైనా తేడా జరిగితే గ్రేటర్ ఎన్నికల్లో కోల్పోయినట్టే పదుల సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. అందుకే గత ఎన్నికలప్పుడు కొన్ని నెలల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లి మొదటిసారి కంటే ఎక్కువ సీట్లు గెలిచిన గులాబీ బాస్ ఇప్పుడు మాత్రం జమిలి రాకుండా ఉంటే బాగుండని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.