తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ అడ్డుపడుతున్నారు.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇది వాస్తవం.! కొన్ని అంశాల్లో స్పష్టత.. అంటూ, కీలకమైన బిల్లుల్ని, నియామకాల్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అడ్డుకుంటున్న తీరు అధికార భారత్ రాష్ట్ర సమితికి అస్సలు మింగుడుపడ్డంలేదు.
వాస్తవానికి, తప్పు దొర్లడం మొదలైంది కేసీయార్ సర్కారు వైపు నుంచే. గవర్నర్‌ని లెక్క చేయకపోవడంతో మొదలైన పంచాయితీ, ఇప్పుడు ఇక్కడిదాకా వచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలన్నది కేసీయార్ సర్కారు ఆలోచన. కానీ, అందుకు గవర్నర్ తమిళిసై, పలు ‘కుంటి సాకులు’ చూపుతున్నారు.
గవర్నర్ తమిళిసై, తెలంగాణలో లేరు. అయినాగానీ, బిల్లు గురించి ఆమె అధ్యయనం చేస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వానికి సందేహాల నివృత్తి కోసం ‘జాబు’ రాస్తున్నారు కూడా.! ప్రభుత్వమూ సమాధానమిస్తోంది. సందేహాలు.. ఆపై సందేహాలు.. వెరసి, బిల్లు మాత్రం ఆలస్యమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సమస్య రాలేదు. గవర్నర్ వ్యవస్థతో ఏపీ సర్కారు పద్ధతిగానే నడుచుకుంటోంది. దాంతో, ఈగో సమస్యలేవీ లేవు. కానీ, తెలంగాణలో అలా కాదు. ఈగో సమస్యలు తారా స్థాయికి చేరాయి.. కేసీయార్ సర్కారుకీ, గవర్నర్‌కీ మధ్య. ‘అబ్బే, ఇలాంటి విషయాల్లో ఎలాంటి ఇగోకీ పోవడంలేదు’ అని గవర్నర్ తమిళిసై చెప్పొచ్చుగాక. కానీ, జరుగుతున్నదేంటో ప్రజలందరికీ అర్థమవుతోంది.
సరే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది మంచిదా.? కాదా.? అన్నది వేరే చర్చ. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని తిప్పి పంపేలా గవర్నర్ వ్యవహరిస్తున్నారన్నది నిర్వివాదాంశం.
ఇలాగైతే, ప్రభుత్వాలు నడవడం కష్టం.. అని కేసీయార్ అండ్ టీమ్ మాత్రమే కాదు, ప్రజాస్వామ్యవాదులూ భావిస్తున్నారు. కానీ, గవర్నర్ పదవికి గౌరవం ఇచ్చి తీరాలి కదా.!