టిఆర్ ఎస్ లో మరొక భంగపాటు కథ ఇది

ఇపుడు  తెలంగాణలో డీసెంట్ పొలిటిషన్, ఉప ముఖ్యమంత్రి  కడియం  శ్రీహరియే టాక్ ఆఫ్ ది టవున్. ఆయన ఆ మధ్య వరంగల్ గెస్టు హౌస్ లో బస చేశాడు. ఉప ముఖ్యమంత్రి కడియం ‘శ్రీహరి గృహనిర్బంధం’ అనే కొత్త, అద్భుతమయిన నినాదంతో   వేలాది మంది అభిమానులు స్టేషన్ ఘన్ పూర్ నుంచి వచ్చి గెస్ట్ హౌస్ ను అక్రమించేశారు. గెస్ట్ హౌస్ లో ఉన్న జాగా అంతా అక్రమించారు. మిద్దెలెక్కారు.చెట్టెక్కారు.  వీళ్లంతా ఎలా వచ్చారో, దీని వెనక ఎవరున్నారో బయటపడనంత రహస్యమేమికాదు. వచ్చిన వాళ్లంతా ఆయన్ని స్టేషన్ ఘన్ పూర్ నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. అదెలా సాధ్యం.

ఘన్ పూర్ నుంచి ఇప్పటికే టిఆర్ ఎస్ అధినేత కెసియార్ డాక్టర్ రాజయ్యపేరు  ప్రకటించి ఉన్నారు. ఆయనను మార్చడం సాధ్యం కాదు. అయినా సరే వేలాది మంది అభిమానులు గెస్ట్ హౌస్ దిగ్భంధం చేశారు. వాళ్లనుద్దేశించి ఉద్వేగంగా  కడియం మాట్లాడరు. రుణ పడిఉంటానన్నారు. మీ చేతులెత్తి నమస్కారం అన్నారు.  మీరిలా రావడంలో ఆవేదన ఉన్నా అది  తప్పన్నారు. పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. ఇలా వేలాది మంది స్టేషన్ ఘన్ పూర్ నుంచి వరంగల్ వైపు వస్తున్నపుడు ఇంటెలిజన్స్ వారు ఈ సమాచారాన్ని ముఖ్యమంత్రికి చేరవేసి ఉంటారు. అలాగే డిప్యూటి సిఎంకు కూడా చెప్పి ఉంటారు. ఇదంతా ఒక పథకం ప్రకారం సాగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కడియం వంటి పెద్ద మనిషి ఇలా ఎందుకు చేశారు?

కడియంకు భవిష్యత్తులో రాజకీయ అభద్రతా భావం ఏర్పడింది. మరొక రెండేళ్లలో ఆయన ఎమ్మెల్సీ టర్మ్ అయిపోతుంది. అపుడు మళ్లీ నామినేట్ చేస్తారోలేదు. ఎందుకంటే అప్పటి పార్టీ నేతకు తన నచ్చకపోవచ్చు.   ఈ లోపు కొత్త ప్రభుత్వం వచ్చాక    ఉపముఖ్యమంత్రి పదవిపోవచ్చు. ఇంత సీనియర్ నాయకుడిగా ఉండి, వారసుడిని లేదా వారసురాలిని తయారుచేసుకోకముందే ఇలా ప్రభుత్వోద్యోగిలాగా రిటైరైపోతే ఎలా అనే బెంగ ఆయన పీడిస్తూ ఉందని తెలిసినోళ్లు చెబుతున్నారు.  ఉప ముఖ్యమంత్రి అయినప్పటినుంచి 105 పేర్ల లిస్టు విడుదలయ్యే క్షణం  దాకా ఆయనకు కెసిఆర్ మీద ఎనలేని విశ్వాసం గౌరవం ఉండింది. సిఎంకు అంజనేయ భక్తుడిగా ఉంటూ వచ్చారు. ఈ భక్తి పారవశ్యంలోఆయన కూతురుని అసెంబ్లీ ఎన్నికల్లో పో టీచేయించవచ్చని అత్యాశపడ్డారు. తన వారసురాలిగా ఆమెను ప్రకటించారు. అయితే, 105 లిస్టులో కూతరు డాక్టర్ కావ్య పేరు లేనేలేదు అంతేకాదు, కాదు, అవినీతివల్ల పదవి కోల్పోయాడని చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్యకే స్టేషన్ ఘన్ పూర్ టికె ట్ ఇవ్వడం ఆయన్ని భయపెట్టి ఉండ వచ్చు.

ముఖ్యమంత్రి  గుడ్ బుక్స్ లో తన పేరులేదని, తను భ్రమల్లో ఉన్నానని ఆయన తెలిసి వచ్చిందని చెబుతున్నారు. ఫలితంగా టిఆర్ఎస్ మళ్లీ గెలిస్తే, తనని  పదవిలో కొనసాగనిస్తారా, ఎమ్సెల్సీగా రిటైరయితే మళ్లీ పెద్దల సభకిపింపస్తారా లేదా, కూతురు కావ్య రాజకీయాల్లోకి రాగలుగుతుందా లేదా… ఇలా అన్ని వైపుల నుంచి ప్రశ్నార్థకాలు ఆయన్ని చుట్టు ముట్టి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు తమనేత మానసిక క్ష్యోభని అర్థం చేసుకుని  ‘కడియం శ్రీహరి గృహనిర్బంధం’ చేపట్టారని చెబుతున్నారు. ఇది చాలా గొప్పగా సాగింది. ఇలాంటిది ఎపుడూ  ఎవరికోసం జరగ లేదు.అయితే, అదే సమయంలో అది కడియం రాజకీయ అభద్రతా భావాన్ని వ్యక్తం చేసిందని పరిశీలకులంటున్నారు.

ఈనేపథ్యం నుంచి ఆయన రాజకీయ భవితవ్యం గురించి రకరకాల కథనాలు వినవస్తున్నాయి. ఆయన టిఆర్ ఎస్ వదిలేస్తారని, కాంగ్రెస్ లో చేరతారని, రహస్యంగా చర్చలు జరిపారని కాదు, బిజెపితో టచ్ లో ఉన్నారాని … ఇలా ఎన్నికథనాలు వినబడుతున్నాయో.

ఈ కథనాలకు ఆధారం లేకపోలేదు. చాలా మంది కీలకనేతలు టిఆర్ ఎస్ లో రాజకీయ భవిష్యత్తు ఉండదనే పార్టీ నుంచి జంప్ చేసి వెళ్లిపోతున్నారు. మొన్న వరంగల్ జిల్లాకే చెందిన  కొండా దంప‌తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఎందుకంటే, వాళ్ల కథ ముగింపుకొచ్చింది. వాళ్లకొక కూతురు ఉంది. ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. అది టిఆర్ ఎస్ లో సాధ్యమయ్యేలా లేదు. అందుకే వారు కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోయారు. నిన్న బాబూమోహన్ పార్టీ నుంచి జంప్ చేసి ఢిల్లీకి వెళ్లి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బిజెపి లో చేరారు. కారణం, బాబూమోహన్ ఎన్నికలకు పనికిరాడని కెసియార్ పక్కన పెట్టారు. అంటే,టిఆర్ ఎస్ లో ఆయన ‘ఫసక్ ’.మరి  ఆయనకూ ఒక కొడుకున్నాడు.కొడుకు వారసుడిగా మారే అవకాశం టిఆర్ ఎస్ లో లేనట్లే. ఆఫ్ట్రాల్ పొలిటిషన్ తండ్రి ఏంకోరుకుంటాడు. కొడుకు లేదా కూతరు తనంత వాళ్లుకావాలని. ఈ కోరిక ముఖ్యమంత్రులకెలా ఉంటుందో రాజకీయాల్లో ఉన్న ఏలాంటి వ్యక్తి కయినా ఉంటుంది. అలాంటపుడు సిటింగ్ లకు ఇంకాబలంగా ఉంటుంది. అదినెరవేరే అవకాశం లేకనే కొండా దంపతులు, బాబూమోహన్ వెళ్లిపోయారు. ఇలాగే  భవిష్యత్తు కనిపించకపోవడంతో చాలా మంది  కారు దిగేసి వెళ్లిపోయారు.

ఈ సారి టిఆర్ ఎస్ గెలిస్తే , క్యాబినెట్ టీం ను ఎంపిక చేసేది కెసీఆర్ వారసుడు కెటిఆరే నని వేరే చెప్పనవసరం లేదు. ఆయన కడియం లాంటి సీనియర్ సిటిజన్లను కొనసాగిస్తాడని నమ్మకం లేదు. ఆయన ఈడూ జోడూ చూసుకునే క్యాబినెట్ సభ్యులను ఎంపికచేస్తారు. కడియం కూడా కారు దిగేస్తారా లేక అక్కడే ఉండి ఏదో ఒకటి సాధిస్తారా? చూడాలి.ఆయనకు ఇంకొక అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికలు. అంతదాకా వేచిచూస్తారా?