ఇంతకాలం ప్రతిపక్షాల నిరసనలు, విద్యార్థుల ధర్నాలు, విద్యార్థి సంఘాల ముట్టడులు.. మరోపక్క ప్రభుత్వం సిట్ ఏర్పాట్లు – మంత్రుల ప్రెస్ మీట్లలో కౌంటర్లు గా సాగుతున్న.. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలోకి తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌదర రాజన్ ఎంటరయ్యారు. దీంతో… వ్యవహరం ఒక్కసారిగా వేడెక్కింది. ఫలితంగా.. అధికారులు ఇరకాటంలో పడ్డారనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా వెలుస్తున్నాయి.
టీఎస్పీఎస్సీ నిర్వహించిన వివిధ రకాల ఉద్యోగాల ప్రశ్నపత్రాల లీకేజీపై విచారణకు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను నియమించింది. దీంతో.. సిట్ ఉన్నతాధికారులు అనేక కోణాల్లో ఇప్పటికే విచారణ చేస్తున్నారు. తాజాగా మరింత వేగం పెంచి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయితే… ఈ సిట్ అధికారులు ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని – కేటీఆర్ & కో ల పాత్ర ఉందన్న అనుమానాలున్న ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు పక్కాగా జరిగే ఛాన్సే లేదని అంటున్నారు విపక్ష నాయకులు. వీరు ప్రభుత్వానికి నివేధిక సక్రమంగా సమర్పించే ఛాన్స్ లేదని.. సమర్పించినా అది సక్రమంగా వెలుగులోకి వచ్చే అవకాశం లేదని.. ఫలితంగా అసలు దోషులు తప్పించుకునే ప్రమాధం ఉందని అంటూ…. “సీబీఐ”తోకానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ ఏంక్వైరీ చేయించాలని, అప్పుడే రిపోర్ట్ కరెక్టుగా వస్తుందని డిమాండ్ చేస్తున్నారు.
సరిగ్గా ఈ సమయంలో గవర్నర్ తమిళసై రంగంలోకి దిగారు. దిగీదిగగానే.. విచారణ నివేదికను 48 గంటల్లో తనకు అందించాలని సిట్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే గ్రూప్-1 పరీక్షల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రాసిన పేపర్లను కూడా తనకు ఇవ్వాలని కోరారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు, విద్యార్థులు, టీఎస్పీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తుండగా… తలలు పట్టుకున్నారంట అధికారులు!
ఎందుకంటే.. ఒకవైపు సిట్ విచారణ అంతా గోప్యంగా జరుగుతుంది. మరోవైపు సిట్ విచారణను స్వయంగా కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో విచారణ పూర్తి చేసి బాధ్యులను కోర్టులో ప్రవేశపెడతారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఈ సమయంలో.. విచారణ వివరాలు మొత్తాన్ని తనకు సబ్మిట్ చేయాలని గవర్నర్ ఆదేశించడంతో టెన్షన్ లో పడ్డారంట అధికారులు!
ఎందుకంటే… విచారణ ప్రోగ్రెస్ ను ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు రిపోర్టు చేస్తుంటారు. అలాంటిది గవర్నర్ ఏకంగా నివేదికనే కోరారు. అంటే… ఒకవైపు కేసీఆర్ పర్యవేక్షిస్తున్న కేసునే మరోవైపు గవర్నర్ టోటల్ రిపోర్టు కావాలని అడుగుతున్నారు. దీంతో… ఇప్పుడు రిపోర్టును కేసీఆర్ కు ఇవ్వాలా? లేకపోతే, గవర్నర్ కు సబ్మిట్ చేయాలా? అన్నది ఉన్నతాధికారులను ఇరకాటంలో పడేస్తోంది! పైగా… గవర్నర్ – కేసీఆర్ మధ్య సంబంధాలు సరిగ్గా లేని ఈ పరిస్థితుల్లో… ఇలాంటి సమస్య రావడంతో సిట్ అధికారులు టెన్షన్ పడుతున్నారట. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది.. మరెలాంటి క్లైమాక్స్ ని ఇస్తుందనేది వేచి చూడాలి! ఏది ఏమైనా… రంగంలోకి గవర్నర్ రావడం.. ఈ వ్యవహారంలో కీలక మలుపనే అంటున్నారు విశ్లేషకులు!