కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది సీనియర్ నేతలు కేసీఆర్ కు అమ్ముడు పోయారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ఆరోపించారు. కేసీఆర్ కను సైగల్లో టికెట్ల కేటాయింపు చేస్తూ పార్టీ దిగజారుడుకు కారణమవుతున్నారని ఆయన విమర్శించారు.
ఏ మాత్రం పట్టు లేని వారికి టికెట్లు కేటాయించి అసలైన నాయకులను పక్కకు పెడుతున్నారన్నారు. కేసిఆర్ ఆదేశానుసారం డమ్మీ క్యాండేట్లకు టికెట్లు దక్కేలా వారు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ టికెట్ల కేటాయింపులో జరుగుతున్న తతంగం పై హైకమాండ్ వెంటనే దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలన్నారు. కేసీఆర్, కేటిఆర్ లకు వ్యతిరేకంగా మాట్లాడితే కొంత మంది నేతలు సహించడం లేదని వ్యాఖ్యానించారు. వారు కేసీఆర్ తో అంతర్గత ఒప్పందం చేసుకొని పార్టీని ఓడగొట్టాలని చూస్తున్నారన్నారు. ఓ ముగ్గురు సీనియర్ నేతలు కేసీఆర్ కోవర్ట్ లు అన్నా కాంతం ఆ ముగ్గురు నేతల పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు.
పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వకుండా నిజమైన నేతలకు టికెట్లివ్వాలన్నారు. పార్టీలోని కేసీఆర్ కోవర్టులను తొలగిస్తే కాంగ్రెస్ గెలుపు సునాయాసమని కాంతం అన్నారు. అప్పటి వరకు ఎంత పోరాడినా కూడా ఫలితం ఉండదన్నారు. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి వివరిస్తామని గజ్జెల కాంతం తెలిపారు.