సీఎం కేసీఆర్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ను నకిరేకల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత చిరుమర్తి లింగయ్య కలిశారు. ఫిబ్రవరి 12న జరిగే చెర్వుగట్టు జాతరలో పాల్గొనాలని లింగయ్య కేసీఆర్ ను  ఆహ్వానించారు. దానికి సీఎం కేసీఆర్ అంగీకరించారు. అలాగే పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వ భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, కాల్వ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. దీనికి కూడా కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తానని లింగయ్యకు కేసీఆర్ హామీనిచ్చారు. అనంతరం చిరుమర్తి లింగయ్య మాట్లాడారు ఆయన ఏమన్నారంటే…

“కేసీఆర్ బిజిగా ఉంటారు కాబట్టి అసెంబ్లీలో కలిశాను. సభ వాయిదా పడ్డ వెంటనే ఆయన దగ్గరకు వెళ్లాను. ఫిబ్రవరి 12 న చెర్వుగట్టు జాతర, స్వామి వారి కళ్యాణం ఉంది. కాబట్టి ఈ జాతరకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశాను. దానికి సీఎం కేసీఆర్ అంగీకరించారు. తప్పకుండా చెర్వుగట్టుకు వస్తానని, గతంలోనే రావాల్సి ఉండేనని గుర్తు చేశారు. అలాగే ధర్మారెడ్డి పల్లి, బునాది కాల్వ పనులు నత్తనడకన సాగుతున్నాయని రైతులకు ఇబ్బంది అవుతుందని తెలియజేశాను. ఆ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరాను. దానికి కూడా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పనులు పూర్తయ్యేలా చూస్తానని హామీనిచ్చారు.” అని లింగయ్య అన్నారు.