ముందస్తు ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ అధికార దుర్వినయోగం వంటి అంశాలపై జాగ్రత్త పడుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పెద్ద టార్గెట్ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. టిఆర్ ఎస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్న సివిల్ సర్వెంట్లపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఎన్నికల సంఘం సీఈవో రజత్ కుమార్ పై కాంగ్రెస్ పార్టీ బాణాలు ఎక్కు పెట్టింది. ఆయన నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతాడనే నమ్మకం కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకే ఆయన పై పలు ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ నేతలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్నా చర్యలు లేకపోవడంపై కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క ఆధ్వర్యలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ హాఠావో… తెలంగాణ బచావో అనే నినాదంతో ప్రజల్లోకెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామన్నారు. ప్రభుత్వ సొమ్ముతో బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.
ఆపధ్దర్మ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుందని, ఎన్నికల అధికారి రజత్ కుమార్ పై తమకు అనుమానాలున్నాయన్నారు. ఈవీఎంల టెస్టింగ్ జిల్లాలలో కాకుండా నియోజకవర్గాలలో కూడా జరగాలన్నారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. అడ్డదారిలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు టిఆర్ ఎస్ ప్రయత్నిస్తుందని వారు విమర్శించారు. గజ దొంగల కంటే ఎక్కువగా టిఆర్ ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందన్నారు.
తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ ప్రచార హోర్డింగ్ లు ఏర్పాటు చేశారని ప్రభుత్వ సొమ్ముతో ఆ హోర్డింగ్ ల ఏర్పాటు జరుగుతుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా మంత్రులు పర్యటనలు చేస్తున్నారని ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ సెప్టెంబర్ 6 వతేదినుంచే ఎందుకు అమలు చేయలేదని వారు ప్రశ్నించారు. ఎన్నికలలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని అందుకే మరో రెండు రోజుల్లో కేంద్రఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని నేతలు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా రజత్ కుమార్ పట్టించుకోవడంలేదని అతని పై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.