తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వైఖరి చర్చకు దారితీస్తోంది. ఇటీవల తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. బీజేపీతో పొత్తు, పార్టీ కార్యకలాపాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు, బహిరంగంగా లేఖ రాయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటివరకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై కుటుంబం ఆంతర్గతంగా మాత్రమే స్పందించేదే తప్ప, బహిరంగంగా ఇలా ఎదిరించడం ఇదే మొదటిసారి.
కవిత లేఖలో బీజేపీతో సంకేతాలు పంపించడంపై అభ్యంతరం, కాంగ్రెస్ కంటే వెనుకబడుతున్న స్థితిపై ఆందోళన, ఉద్యమ నేతలకు గౌరవం తగ్గడంపై ఆవేదన వ్యక్తమయ్యాయి. ప్లీనరీ నిర్వహణపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో ఆమె బీఆర్ఎస్ పార్టీలోని పలు మార్పులపై అసహనం వ్యక్తం చేసినట్టే స్పష్టం అవుతోంది. ఈ పరిణామం ఆమె పార్టీలో ఉంటూ అధికారికంగా వ్యతిరేక స్వరం వినిపించినట్టుగా మారింది.
ఈ వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ కూడా తమదైన శైలిలో స్పందించాయి. బీజేపీ వ్యాఖ్యలతో కాంగ్రెస్ కవిత వెనుక ఉందని దుయ్యబట్టగా, కాంగ్రెస్ మాత్రం బీజేపీ స్క్రిప్ట్ ఇదేనంటూ ఎద్దేవా చేసింది. ఇలా కవితను రెండు ప్రధాన పార్టీలూ రాజకీయంగా గుసగుసల జోలకి తెచ్చేసినట్టే. ఆమె ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉండటం, గతంలో ఎంపీగా పనిచేయడం, ఇప్పుడు బహిరంగంగా కేసీఆర్‌కు లేఖ రాయడం చూసి కొందరు ఆమెను “తెలంగాణ షర్మిల”గా అభివర్ణించడం మొదలుపెట్టారు. ఏపీలో జగన్ తో విబేధాలల కారణంగా షర్మిల ఆమె మరో దారిలో వెళుతున్న విషయం తెలిసిందే. ఇక కవిత కూడా అలానే వెళ్లడం కాయమని మరికొందరు అంటున్నారు.
కేసీఆర్ పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్‌కు అప్పగించబోతున్న సమయంలో, కవిత వ్యవహారం కొత్త మలుపు తేస్తుందా? లేక ఇది ఒక వ్యూహాత్మక అసంతృప్తి వ్యక్తీకరణ మాత్రమేనా? అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. చివరకు ఇది వ్యక్తిగత అభిప్రాయంగా ముగుస్తుందా? లేక బీఆర్ఎస్ కుటుంబ రాజకీయాల్లో విడిపోతోన్న వేలు పాత్రగా నిలవబోతుందా అనేది వేచి చూడాల్సిందే.