దుబ్బాక ఉప ఎన్నికల గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలకు సంసిద్దమవుతోంది. సన్నాహకాల్లో భాగంగా తెరాసను ఓడించగల అంశాలను వెతికి పెట్టుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్ వరదల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని, వరద సహాయం పంపిణీలో తెరాస నేతల అనుచరుల చేతి వాటాన్ని హైలెట్ చేస్తున్న బీజేపీ మరొక కీలక విషయాన్ని తెరపైకి తీసుకురావాలని భావిస్తోంది. అదే ఎంఐఎం పార్టీతో కేసీఆర్ స్నేహం. కేసీఆర్ ఛాన్నాళ్ల నుండి ఎంఐఎంతో సఖ్యతగా ఉండటం చూస్తూనే ఉన్నాం. మాకు మీరు అడ్డుపడొద్దు, మీకు మేము అడ్డుపడము అనే ఒప్పందంతో మెలుగుతున్నాయి ఇరు పార్టీలు.
దీన్నే గ్రేటర్ ఓటర్ల ముందు తప్పులా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు బీజేపీ పెద్దలు. బీజేపీని విమర్శించాల్సి వచ్చినప్పుడల్లా కేసీర్, కేటీఆర్, ఇతర నేతలు లేవనెత్తే అంశం ఆ పార్టీ మతచాంధసవాద పార్టీ అని, మతం ప్రాతిపదికన రాజకీయాలు చేయాలనుకుంటుందని అంటుంటారు. మరి బీజేపీ మతవాద పార్టీ అయినప్పుడు ఎంఐఎం సెక్యులర్ పార్టీ ఎలా అవుతుంది. సరిగ్గా చూస్తే బీజేపీ, ఎంఐఎం రెండు పార్టీల లక్షణాలు ఒక్కటిగానే ఉంటాయి. అలాంటప్పుడు తెరాస ఎంఐఎంతో స్నేహం చేస్తూ బీజేపీని విమర్శించడం అనేది అర్థంలేని పని. దీన్నే గట్టిగా ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటోంది బీజేపీ. కేసీఆర్ ఎంఐఎం పార్టీ బలోపేతంగా ఉన్న స్థానాల్లో పాలన విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనేది కాషాయ నేతల వాదన.
ఇప్పటివరకు పాతబస్తీలో ఎంత పన్నులు వసూలయ్యాయో లెక్కలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్ మొత్తం మీద పక్కాగా పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం పాతబస్తీ విషయంలో చూసీచూడనట్టు పోతోందని, ఇతర జనాభా కడుతున్న పన్నులను తీసుకెళ్లి పాతబస్తీలో ఖర్చు చేస్తోందని, దీని మూలంగా పన్నుల కడుతున్న ప్రజల మీద పెను భారం తప్ప వారికి ఎలాంటి ప్రయోజనమూ ఉండట్లేదని, ఇదంతా ఎంఐఎం కోసమే చేస్తున్నారని చెబుతోంది. ఈ వాదనను గనుక బీజేపీ రుజువు చేయగలిగితే తెరాసను ఇబ్బందుల్లో పడినట్టే. మరి బీజేపీ పన్నుతున్న ఈ వ్యూహం నుండి కేసీఆర్ ఎలా తప్పించుకుంటారో చూడాలి.