తెలంగాణ : తెలుగుదేశం పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా క్యాడర్ ఉంది. నాయకులతో సంబంధం లేకుండా పార్టీకి క్యాడర్ అండగా ఉంది ఎన్నికలలో ఆ పార్టీ పోటీ చేస్తే మాత్రం కచ్చితంగా బిజెపి విజయావకాశాలు మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. దుబ్బాక లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా… కొంత మంది తెలుగుదేశం పార్టీ పరోక్ష సహకారం ఉంది అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం దుబ్బాకలో తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ ఉన్నాసరే ఆ పార్టీ మాత్రం పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. చంద్రబాబు నాయుడు వద్దకు కొన్ని ప్రతిపాదనలు వచ్చినా సరే ఆయన మాత్రం పోటీ చేయడానికి ముందుకు రాలేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేసి ఉంటే పెద్ద నాయకులు లేకపోయినా ఐదు నుంచి ఆరు వేల ఓట్ల వరకు ఆ పార్టీకి వచ్చి ఉండేవి.దీనితో అవి భారతీయ జనతా పార్టీకి వచ్చాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది డైరెక్ట్ గా బీజేపీకి వెళ్ళింది. తెరాస పార్టీ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఒకవేళ తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఉంటే ఆ పార్టీకి ఓట్లు వేసి ఉండే వాళ్ళు.తెలుగుదేశం ఉంటే ఆ పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎక్కువ పడి ఉండేవి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కూడా విజయం అనేది చాలా అవసరం. టిఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఎదుర్కోవాలి అంటే ఆ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా ఉండకూడదు. దీంతో ఇప్పుడు కొన్ని పార్టీల విషయంలో భారతీయ జనతా పార్టీ చాలావరకు జాగ్రత్త వహిస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ విషయంలో హైదరాబాద్ లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాస్త వ్యూహాత్మకంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఏపీలో తెలుగుదేశం పార్టీని ఎంత ఇబ్బంది పెట్టినా సరే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ అవసరం అనేది బీజేపీకి చాలా ఎక్కువగా ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పాలి.దీంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలుగుదేశం పార్టీ నాయకుల మద్దతు కోరే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో ఒక అవగాహనకు బిజెపి వస్తే గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకి భారీ నష్టం తప్పదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.