తెలంగాణలో షర్మిలకు లైన్ క్లియర్ చేస్తున్న ఆ ముగ్గురు.!

Ys sharmila
Ys sharmila
Ys sharmila

తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన పార్టీలుగా చెలామణీ అవుతున్నవి తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, మజ్లిస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో వున్నా, లేనట్టే. వామపక్షాల సంగతి సరే సరి. అవెప్పుడో తోక పార్టీలుగా మిగిలిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే..

ఆ స్థానంలోనే షర్మిల కొత్త రాజకీయ పార్టీని తీసుకురాబోతున్నారు. షర్మిల పార్టీ వైపు చూస్తున్న నాయకుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అసలు ఈ పొలిటికల్ వాక్యూమ్ ఎలా ఏర్పడుతోంది.? అంటే, మూడు ప్రధాన పార్టీల నిర్వాకం కారణంగానేనన్న అభిప్రాయాలు సర్వ్రతా వినిపిస్తున్నాయి. మజ్లిస్ పార్టీ.. రాజకీయం వేరు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ విషయానికొస్తే.. తెలంగాణ అభివృద్ధి విషయంలో.. ఈ మూడు పార్టీలూ కీచులాడుకుంటున్నాయి. ఒకటి గతంలో అధికారంలో వున్న పార్టీ.. ఇంకొకటి ప్రస్తుతం అధికారంలో వున్న పార్టీ.. మరొకటి అధికారం మీద కన్నేసిన పార్టీ. ఈ ముగ్గురి కీచులాటల కారణంగా ఏర్పడ్డ పొలిటికల్ వాక్యూమ్ షర్మిలకు ఉపయోగపడుతోంది. బహుశా ఈ ఈక్వేషన్ గురించి ముందుగానే ప్లాన్ చేసుకుని, సరైన అంచనాలతో వైఎస్ జగన్, తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి, షర్మిలతో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని అనుకోవాలేమో.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాతో కూడా ఆ పని చేయొచ్చు. కానీ, అలా చేస్తే.. అది ఆంధ్రా పార్టీ అనే ముద్ర పడుతుంది. అదే, షర్మిల ద్వారా చేయిస్తే.! అదే వర్కవుట్ అయ్యేలా వుందిప్పుడు. ‘రాజన్న రాజ్యం’ అనే కాన్సెప్ట్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వైఎస్సార్ సానుభూతిపరుల్ని తనవైపుకు తిప్పుకుంటున్నారు షర్మిల. మరోపక్క ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్ములాడుుకుంటున్నాయి. ఐటీఐఆర్ సహా అనేక అంశాల్లో ఈ ముగ్గురూ పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు షర్మిలకు రాజకీయంగా కలిసొస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.