ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రేసు రోజురోజుకూ అత్యంత ఆసక్తికరంగా మారుతోంది. జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార కూటమిలో ఇద్దరు ప్రముఖ నాయకుల కుమార్తెల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో జిల్లావ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ పీక్స్‌కు చేరింది. దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని సాయి నవ్యశ్రీ ఒకవైపు, జిల్లాలోని మరో ప్రముఖ నేత ఘంటా మురళీ కుమార్తె మందలపు జాహ్నవి మరొకవైపు ఈ రేసులో ముందంజలో ఉన్నారు.
ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో చింతమనేని నవ్యశ్రీ పెదవేగి జెడ్పీటీసీ స్థానం నుండి ఏకగ్రీవంగా ఎన్నికై చైర్మన్ రేసులో తన పట్టును మరింత బలోపేతం చేసుకున్నారు. ఏలూరు జిల్లాలోనే ఇది తొలి ఏకగ్రీవం కావడంతో ఆమె పేరు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, మందలపు జాహ్నవి కూడా అధిష్ఠానం మద్దతు కోసం, జిల్లాలోని కీలక నేతల ఆశీస్సుల కోసం గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులూ సామాజికంగా, రాజకీయంగా బలమైన నేపథ్యం ఉన్నవారే కావడంతో ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
దాదాపుగా ఇద్దరిలో ఒకరి పేరు ఖరారు అయినట్టు సమాచారం అందుతుండటంతో, కూటమి అధిష్ఠానం తుది నిర్ణయం ఎవరి వైపు ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. తండ్రుల రాజకీయ ప్రాభవం, స్థానిక సమీకరణాలు ఈ చైర్మన్ పీఠాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. మరి ఈ ప్రతిష్టాత్మక ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ కుర్చీని అధిష్టించే అదృష్టం చింతమనేని నవ్యశ్రీని వరిస్తుందా.. లేక మందలపు జాహ్నవికి దక్కుతుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.