కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో సరికొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. నియోజకవర్గంలో దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తూ, కష్టకాలంలో నిలబడిన పాత టీడీపీ నేతలకు ప్రస్తుతం పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లు, పరిషత్ ఎన్నికలకు సంబంధించి సీట్ల కేటాయింపులు, అభ్యర్థుల ఎంపికలో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
ఆమె ఎవరిని డిసైడ్ చేస్తే.. వారే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న పరిస్థితి కడప నగరంలో కనిపిస్తోంది. ఈ ఎన్నికల పర్వంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆధిపత్యం కేవలం నగరానికే పరిమితం కాలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె భర్త రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి, నియోజకవర్గ పరిధిలోని గ్రామాల మీద కూడా ఆమె జోక్యం గణనీయంగా పెరిగిపోయింది. ఒకవైపు ఎమ్మెల్యే పవర్, మరోవైపు భర్తకు జిల్లా పార్టీ పగ్గాలు ఉండటంతో కడప నియోజకవర్గంలోని ప్రతి పల్లెలోనూ అభ్యర్థుల ఎంపికను ఈ దంపతులే శాసిస్తున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల నుంచి మొదలుకొని స్థానిక నాయకత్వం వరకు ప్రతి నిర్ణయం వీరి కనుసన్నల్లోనే జరుగుతుండటంతో కిందిస్థాయి సీనియర్ నాయకులు కిక్కురుమనలేకపోతున్నారు. ఈ విధమైన ఏకపక్ష ఆధిపత్యం కడప టీడీపీలో తెరవెనుక అసమ్మతికి దారితీస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు ఎదుర్కొని పార్టీ కోసం పోరాడిన పాత తమ్ముళ్లను కాదని…
కేవలం ఎమ్మెల్యే అనుచర వర్గానికి, ఆమె కోటరీకే స్థానిక సంస్థల్లో టికెట్లు ఇచ్చుకుంటూ పోవడంపై పాత కాపులు గుర్రుగా ఉన్నారు. ఈ అంతర్గత విభేదాలు మరియు సమన్వయ లోపం రాబోయే ఎన్నికల ఫలితాలపై ఎక్కడ ప్రభావం చూపిస్తుందోనని కొందరు అగ్రనేతలు ఆందోళన చెందుతున్నారు. మాధవి రెడ్డి తన ఒంటెద్దు పోకడలను పక్కన పెట్టి అందరినీ కలుపుకుపోకపోతే, స్థానిక సంస్థల పోరులో ఊహించని ఎదురుదెబ్బలు తగిలే ప్రమాదం ఉందని క్షేత్రస్థాయి క్యాడర్ హెచ్చరిస్తోంది.