బెజవాడ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. ఏబీవీకి ఎన్నారైల మద్దతు..!

విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ పీఠం కోసం జరగబోయే ఎన్నికలు ముక్కోణపు పోరుతో అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ, వైసీపీ తరఫున రాయన భాగ్యలక్ష్మి బరిలో నిలవగా.. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా ఎంట్రీ ఇచ్చి సమీకరణాలను పూర్తిగా మార్చేశారు. గతంలో విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేసిన ఏబీవీకి కాంగ్రెస్, వామపక్షాలు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి.

అయితే, ఈ ఎన్నికల వెనుక సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద పొలిటికల్ గేమ్ నడుస్తోందని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. కూటమి తరఫున సీటు జనసేనకు వెళ్లడం, అందులోనూ వంగవీటి రాధాకు అభ్యర్థిత్వం దక్కడం తెలుగుదేశం పార్టీలోని ఒక బలమైన అసంతృప్త వర్గానికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. రాధాకు నేరుగా సహకరిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందోననే ఆందోళనతో, టీడీపీలోని ఆ అంతర్గత వర్గం ఒక వ్యూహాత్మక అడుగు వేసింది.

వంగవీటి రాధాను బహిరంగంగా ఎక్కడా విమర్శించకుండా, ఆయన అభిమానుల ఆగ్రహానికి గురికాకుండా జాగ్రత్తపడుతూనే.. స్వతంత్ర అభ్యర్థి ఏబీవీని గెలిపించాలంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం తెరవెనుక ప్రచారాన్ని తీవ్రం చేసింది. ఈ అంతర్గత ఆపరేషన్‌లో విదేశాల్లో ఉన్న కొందరు ఎన్నారైలు, ఐటీ విభాగం ప్రతినిధులు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బెజవాడ అభివృద్ధి చెందాలంటే ఒక సమర్థుడైన, చదువుకున్న మాజీ అధికారి చేతిలో నగర పగ్గాలు ఉండాలంటూ వారు చేస్తున్న పాజిటివ్ క్యాంపెయిన్ వెనుక.. కూటమి ఓట్లను, ముఖ్యంగా టీడీపీ క్యాడర్ ఓట్లను ఏబీవీ వైపు మళ్లించే పెద్ద స్కెచ్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాధాకు సీటు ఇవ్వడం ఇష్టం లేని టీడీపీ అసంతృప్త నేతలే ఏబీవీని రంగంలోకి దించారని, ఈ ఓట్ల చీలిక అంతిమంగా ఎవరికి నష్టం చేకూరుస్తుందనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.