ఎప్పుడూ చేసే పనులే అయినా ఒక్కోసారి అనుకోని విధంగా తలనొప్పులు తెస్తుంటాయి. అందుకు సాక్ష్యమే జీటీవీ నందు ప్రదర్శితమయ్యే అదిరింది అనే కామెడీ షో వ్యవహారం. ఆ కార్యక్రమంలో ఒక ఆర్టిస్ట్ వైఎస్ జగన్ ను అనుకరిస్తూ కామెడీ స్కిట్ చేయడం జరిగింది. జగన్ హావభావాలను అనుకరిస్తూ ఇప్పటికే ఎంతో మంది కామెడీ స్కిట్లు చేశారు. టిక్ టాక్ లాంటి వాటిల్లో అయితే జగన్ ను అనుకరిస్తూ ఎంతోమంది ఔత్సాహికులు వీడియోలు చేశారు. ఇలా సెలబ్రిటీలను అనుకరిస్తూ నవ్వించడం కొత్తగా వచ్చిన పద్దతేమీ కాదు. ఎన్నాళ్ళ నుండో ఉన్నదే, ఎంతోమంది చేసిందే. కానీ ఈసారి మాత్రం జగన్ అభిమానులు చాలా వైల్డ్ రియాక్షన్ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని ఇలా అవమానిస్తారా అంటూ విరుచుకుపడ్డారు.
ఆ షోలో నాగబాబు ఉండటం, షో యాంకర్ స్కిట్ చూసి విపరీతంగా నవ్వడం వివాదాన్ని మరింత పెద్దది చేశాయి. సోషల్ మీడియా వేదికగా వైసీపీ అభిమానులు, కార్యకర్తలు షో నిర్వాహకుల మీద, జీ ఛానల్ మీద, స్కిట్ వేసిన ఆర్టిస్ట్ మీద కామెంట్లతో ప్రతాపం చూపించారు. చివరికి ఆర్టిస్ట్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు కూడ. ఇక ఛానల్ యాజమాన్యానికి సైతం సెగ తప్పలేదు. కొందరైతే ఛానల్ బ్యాన్ చేయాలని అన్నారు. ఎంతైనా అధికార పార్టీ కాబట్టి వివాదం అంతర్గతంగా కూడ వేడిగానే నదిచింది. ఇదిలా నడుస్తూ ఉండగానే జీటీవీ యాజమాన్యం ఏపీ ప్రభుత్వానికి 10 అంబులెన్సులను విరాళం కింద ఇచ్చింది. దీంతో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఎన్నో వైద్య సేవలు అందిస్తోంది. ఆ ట్రస్ట్ కోసమే జీటీవీ యాజమాన్యం అంబులెన్సులు ఇచ్చింది. వాటిని ఎమ్మెల్యే ఆర్కే రోజా, మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. సరిగ్గా వైసీపీ అభిమానులకు, ఛానల్ కు మధ్య వివాదం నడుస్తున్న తరుణంలోనే సదరు ఛానల్ యాజమాన్యం ఇలా భారీ విరాళం ఉవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వ్యతిరేకత నుండి బయటపడటం కోసమే ఈ ప్రయత్నమని అన్నారు చాలా మంది. ఏది ఏమైనా, ఎందుకోసం చేసినా ఛానల్ 10 అంబులెన్సులను విరాళంగా ఇవ్వడం మంచి విషయం. అందులో తప్పేం లేదు కూడ. మరి ఈ చర్యతో అయినా వైసీపీ శ్రేణులు శాంతిస్తారేమో చూడాలి.