ప్రచారం ఘనమేగానీ, ‘ఫలితం’ శూన్యం.!

కేవలం, పత్రికల్లో నిలువెత్తు ప్రకటనలు గుప్పించడం ద్వారా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ప్రాచుర్యం పెరుగుతుందా.? అదే నిజమైతే, చంద్రబాబు హయాంలో అమల్లోకొచ్చిన సంక్షేమ పథకాలు ఇంకోసారి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి వుండాలి.

అసలు విషయమేంటంటే, వైసీపీ అధికారంలోకి వచ్చాక.. పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలతో సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రచారమైతే ఆగలేదు. ‘మాది పని చేసే ప్రభుత్వం.. మాకు ప్రచారం అవసరం లేదు. మేం ఫుల్ పేజీ ప్రకటనలు పత్రికలకు ఇవ్వబోం..’ అని కొందరు వైసీపీ నేతలు చెప్పుకున్నారు.. కానీ, పబ్లిసిటీ చేసుకోక తప్పడంలేదు ప్రభుత్వానికి. దాన్ని పూర్తిగా తప్పుపట్టేయలేం కూడా.

అయితే, ఇక్కడో సమస్య వుంది. మంత్రుల్లో చాలామంది నిస్తేజంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సంగతి సరే సరి. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వుండడంలేదన్న విమర్శలు చాలామంది వైసీపీ ప్రజా ప్రతినిథుల మీద వున్నాయి.

సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా.? లేదా.? వాటి పట్ల ప్రజలు సంతృప్తిగా వున్నారా.? లేదా.? అన్న విషయాలపై కింది స్థాయిలో వైసీపీ నేతలు ఆరా తీయడంలేదట. ప్రజల్లో వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నా, డ్యామేజీ కంట్రోల్ చర్యలకు ఉపక్రమించడంలేదట.

తాజాగా వరదలు సంభవించిన నాలుగు జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు సమర్థవంతంగా పని చేస్తున్నా, చాలామంది కీలక నేతలు మాత్రం ప్రచారానికే పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి. ‘మంచి పనులు చేస్తే సరిపోదు.. వాటి గురించి చెప్పుకోవాలి కూడా..’ అని వైసీపీలోనే చర్చ జరుగుతోందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. విపక్షాల విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి రావడం పార్టీ వైఫల్యమే.