YSRCP Vs TDP : బెజవాడలో పైశాచికత్వం: ఇంత నికృష్ట రాజకీయమా.?

YSRCP Vs TDP : వినోద్ జైన్ అనే ఓ వ్యక్తి, పధ్నాలుగేళ్ళ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో, బాధితురాలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. నిందితుడు వినోద్ జైన్, టీడీపీ నేత కావడమే అందుక్కారణం. తెలుగుదేశం పార్టీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

వినోద్ జైన్, గతంలో భారతీయ జనతా పార్టీ నేతగా పనిచేశారు. అప్పట్లో ప్రస్తుత వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌కి అత్యంత సన్నహితుడిగానూ వున్నారు. వెల్లంపల్లి, వైసీపీలోకి రాగా, వినోద్ జైన్.. బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చాడు. టీడీపీలోకి వచ్చినా, వినోద్ జైన్.. వెల్లంపల్లి శ్రీనివాస్‌కి అత్యంత నమ్మకస్తుడైన అనుచరుడిగా కొనసాగుతున్నాడని టీడీపీ తాజాగా ఆరోపిస్తోంది.

తెలుగుదేశం పార్టీకీ, వైసీపీకీ మధ్య ‘వినోద్ జైన్’ విషయమై పెద్ద రాజకీయ రచ్చే జరుగుతోంది. బాధితురాలి కుటుంబం, తమకు న్యాయం కావాలని రోదిస్తోంటే, టీడీపీ అలాగే వైసీపీ.. ఈ రెండు పార్టీలూ రాజకీయ కొట్లాటలో బిజీగా వున్నాయి.

ఏ పార్టీ వాడైతేనేం, వినోద్ జైన్ నిందితుడు.. అతన్ని దోషిగా నిరూపించేందుకు వైఎస్ జగన్ ఏం చర్యలు తీసుకుంటుందన్నది కీలకం. ఓ ఆర్నెళ్ళలో లేదా ఓ ఏడాదిలో వినోద్ జైన్ ఉరి కంబానికి వేలాడతాడా.? ఆ గ్యారంటీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా.? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.

దిశ బిల్లు చట్టంగా మారకపోయినా, దిశ చట్టం ద్వారా బాధితుల కుటుంబాలకు న్యాయం చేసేస్తున్నామని హోం మంత్రి సహా పలువురు వైసీపీ ముఖ్య నేతలు చెబుతూ వస్తున్నారు. ఎలాంటి న్యాయం చేస్తున్నారు.? వినోద్ జైన్ కారణంగా బలైపోయిన చిన్నారికి ఎలాంటి న్యాయం చేస్తారు.? అది కదా ముఖ్యం.!