YSRCP : వైసీపీకి అంతర్గత శతృవుల ముప్పు పెరుగుతోంది.!

YSRCP : రాజకీయాల్లో హత్యలుండవు.. అన్నీ ఆత్మహత్యలేనంటారు రాజకీయ పరిశీలకులు. దానర్థం వెన్నపోట్లు.. సొంత పొరపాట్ల కారణంగా నష్టపోవడమన్నమాట. ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీకి అంతర్గత పోట్లు ఎక్కువైపోతున్నాయి. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళుతోంటే, స్థానిక నాయకత్వం నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుండడం దేనికి సంకేతం.? అన్న విషయమై అధికార పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది.

చాలాకాలంగా సొంత నియోజకవర్గంలో తీవ్రస్థాయి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు నగిరి ఎమ్మెల్యే రోజా. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలైన రోజానే ఈ పరిస్థితులు ఎదుర్కొంటుండడం ఆశ్చర్యకరమైన విషయం. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత.. ఈ వ్యవహారాలపై దృష్టిపెట్టడంలేదా.? లేదంటే, రోజా వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకరు మంత్రి, ఇంకొకరు ఎమ్మెల్యే. ఇద్దరూ ఒకే పార్టీలో వున్నారు. ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితులు ఏర్పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలకు మధ్య వివాదాలు నడుస్తున్నాయి. రాజమండ్రి ఎంపీ భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య వివాదం తెలిసిన విషయమే.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు పూర్తయిపోయింది. రానున్న ఏడాది చాలా కీలకం. ఈ ఏడాదిలో పార్టీలో చాలా జరుగుతాయ్.. వీటి పట్ల అప్రమత్తంగా వుండాలి. కానీ, పార్టీలో లోటుపాట్లను సరిదిద్దే యంత్రాంగమే లేకుండా పోయినట్లుంది. ముఖ్య నేతలుగా చెప్పబడుతున్న వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి.. అంతర్గత కుమ్ములాటల్ని సరదిద్దలేకపోవడం ఆశ్చర్యకరం.

ఈ కొట్లాటలు ఇలాగే పెరిగితే, వైసీపీ ప్రభుత్వ మనుగడకే అది ముప్పు తెచ్చే అవకాశం లేకపోలేదు.