మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షడిగా నియామకం అయినా తర్వాత దూకుడు పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ ప్రాసెస్లో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు లేవనెత్తిన రాజీనామాల అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. అమరావతిని రాజధానిగా వద్దనే వైసీపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలని, బైఎలక్షన్లకు అమరావతిని రెఫరెండంగా పెట్టుకుని పోటీలోకి దిగాలని, ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యేలు ఓడితే జగన్ తీసుకున్న మూడు రాజధానముల నిర్ణయానికే కట్టుబడతామని సవాల్ విసిరారు.
అయితే ఈ సవాల్ విని వైసీపీ నేతలు ఆవేశంతో ఊగిపోలేదు. చాకచక్యంగా అచ్చెన్నను చిక్కుల్లో పెట్టే ప్రతి సవాల్ చేశారు. అమరావతి కోసం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయడం ఎందుకు. అమరావతి కావాలంటున్నది టీడీపీ నేతలే కదా. అప్పుడే వాళ్ళే రాజీనామాలు చేసి అమరావతి నినాదంతో ఉప ఎన్నికల్లోకి దిగండి. మేము కూడా పోటీ చేస్తాం. అప్పుడు జనం ఎవరిని గెలిపిస్తే వారి మాటే నెగ్గుతుంది అంటున్నారు. అంటే తమ 151 మంది ఎమ్మెల్యేల సీట్లు పదిలంగా పెట్టుకుని టీడీపీ గెలిచిన ఆ 23 స్థానాలకు ఎసరు పెట్టారన్నమాట.
అసలు రాజీనామాలు చేయమంటున్న అచ్చెన్నాయుడే ముందుగా తన ఎమ్మెల్యే పోస్టుకు రాజీనామా చేసి ఎన్నికలకు దిగాలని, గతంలో తెలంగాణ కోసం తెరాస ఎమ్మెల్యేలు మాత్రమే రాజీనామా చేశారు తప్ప మిగతా పార్టీల వారిని రాజీనామాలు చేయమని అడగలేదని, అలాగే టీడీపీ వాళ్ళు కూడ చేయండి అంటున్నారు. దీన్నిబట్టి వైసీపీ భస్మాసుర హస్తం ఫార్ములను ఫాలో అవుతోందని అర్థమవుతోంది. రాజీనామాలు రాజీనామాలు అంటున్న అచ్చెన్న నెత్తినే ఆ రాజీనామా సవాలును పెట్టి ప్రయోగం చేయాలనుకుంటున్నారు. ఒకవేళ ఈ ప్రయోగంలో అచ్చెన్న ఎమ్మెల్యే పదవి కోల్పోతే ఇంకేమైనా ఉందా. చంద్రబాబు సహా టీడీపీలోని అందరికీ ఫీజులు ఎగిరిపోవూ.