తెలంగాణ రాష్ట్ర సమితిని నిలదీసే హక్కు వైసీపీకి వుందా.?

YSRCP And TRS :  తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఏపీలో రోడ్ల పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలు, కరెంటు విషయంలో చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశాలయ్యాయి. ఈ విషయమై ఏపీకి చెందిన పలువురు మంత్రులు, వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కౌంటర్ ఎటాక్ గట్టిగానే చేశారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ఈ పంచాయితీ అస్సలేమాత్రం మంచిది కాదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య సఖ్యత వుండాలి. ఒకరి విషయాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోకుండా వుండడం ఇరు రాష్ట్రాలకీ మంచిది. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలవడానికి కారణం తెలంగాణ. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోకపోయి వుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడీ దుస్థితి వుండేది కాదు.

అయితే, ఏపీ వైసీపీ నేతలు ఘాటైన విమర్శలతో తెలంగాణ రాష్ట్ర సమితిపై విరుచుకుపడ్డంలోనూ అర్థం లేదు. తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చెప్పడం హాస్యాస్పదమే. ప్రజల్లో పలచనైపోయే వ్యవహారాలివి.

ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలసలు జరుగుతున్నాయి తప్ప, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వలసలేమీ లేవు. ఆంధ్రప్రదేశ్ దుస్థితి గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ మాట్లాడుకుంటున్నారు.

కోవిడ్ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది ప్రజల్ని, అందునా ప్రజా ప్రతినిథుల్ని ఆదుకున్నది తెలంగాణ మాత్రమే. ఆ విషయాన్ని తెలంగాణలో వైద్య చికిత్స పొంది కోలుకున్న వైసీపీ నేతలూ మర్చిపోతే ఎలా.?