వైసీపీ ఎమ్మెల్యే మృతి: ఏపీలో మరో ఉప ఎన్నిక

YSCRP MLA dead

YSCRP MLA dead

తిరుపతి సిట్టింగ్ ఎంపీ హఠాన్మరణంతో, తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ నేత బల్లి దుర్గాప్రసాద్ ఎంపీగా గెలిచారు. కాగా, వైసీపీకి చెందిన మరో ప్రజా ప్రతినిథి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారు. వైద్య చికిత్స అనంతరం కోలుకున్నారు.. ఈ మధ్యనే జరిగిన స్థానిక ఎన్నికల్లో ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేశారు. అయితే, మరోమారు అనారోగ్యం బారిన పడి, ఈ రోజు తెల్లవారుఝామున కన్నుమూశారు. వృత్తి రీత్యా వైద్యుడు అయిన డాక్టర్ వెంకట సుబ్బయ్య రాజకీయాల్లోకి వస్తూనే తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. స్థానికంగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. వివాద రహితుడిగా ఆయనకు రాజకీయాల్లో మంచి గుర్తింపు వుంది.

ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణం పట్ల అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఎమ్మెల్యే పరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా వుంటే, వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేలు నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరైంది. తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో మరో మారు ఉప ఎన్నికలు ఖాయంగానే కనిపిస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి మారిన పలువురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.