దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సంబంధించి మూడు కీలక అంశాల గురించి తెలుగు నాట చర్చ జరుగుతోంది. అందులో ఒకటి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం కాగా, ఇంకొకటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద చంద్రబాబు హయాంలో జరిగిన హత్యాయత్నం (కోడి కత్తి వ్యవహారం). మూడోది, వైయస్ వివేకానంద రెడ్డి హత్య. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ మూడు అంశాలూ.. రాజకీయంగా చాలా ప్రాధాన్యత గలవి. వైఎస్సార్ మరణం తర్వాత నడిచిన రాజకీయాలు అందరికీ తెలిసినవే.
కాంగ్రెస్, వైఎస్సార్ కుటుంబాన్ని కాదనుకుంది.. వైఎస్ జగన్‌ని దూరం పెట్టింది. దాంతో, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అయితే, వైఎస్సార్ మరణంపై పలు సందర్భాల్లో, పలు వేదికలపై జగన్, విజయమ్మ అనుమానాలు లేవనెత్తిన మాట వాస్తవం. మరి, అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్, ఆ ఘటనపై ఎందుకు ప్రత్యేక విచారణకు ఆదేశించలేకపోయారు.? అన్న ప్రశ్న తెరపైకి రావడం సహజమే. వైఎస్ వివేకా హత్య విషయంలోనూ వైఎస్సార్ కుటుంబం చాలా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇంకోపక్క వైఎస్ జగన్ మీద జరిగిన హత్యాయత్నంపైనా నానా రచ్చా జరిగింది. ఇవన్నీ తిరుపతి ఉప ఎన్నిక వేళ చర్చనీయాంశాలవుతున్నాయి. ‘సొంత కుటుంబానికి న్యాయం చేసుకోలేకపోయిన జగన్..’ అనే విమర్శలు రావడంతో, వైయస్ విజయా రాజశేఖర్ రెడ్డి ఓ బహిరంగ లేఖ రాయాల్సి వచ్చినట్లుంది. పైగా, కుటుంబంలో విభేదాలు.. అంటూ టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న చర్చ కారణంగా విజయా రాజశేఖర్ రెడ్డి స్పందించక తప్పలేదని అనుకోవాలేమో.
సుదీర్ఘంగా తన వాదనల్ని, తన ఆవేదనని ఈ లేఖలో విజయమ్మ పేర్కొన్నారు. అయితే, విజయలక్ష్మి బహిరంగ లేఖ రాయాల్సిన పనిలేదు.. వైఎస్ జగన్ పెదవి విప్పితే సరిపోయేది. అన్నట్టు, షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ వ్యవహారాన్ని కూడా విజయమ్మ ఈ లేఖలో పేర్కొనడం గమనార్హం. ఈ లేఖతో ఎటూ రాజకీయ ప్రత్యర్థులు సంతృప్తి చెందరు. కానీ, ఆయా అంశాలకు సంబంధించి ప్రజల్లో కొత్త అనుమానాలు బయల్దేరేందుకు ఈ బహిరంగ లేఖ ఆస్కారం కల్పిస్తుందేమోనన్న ఆందోళన అయితే వైసీపీ వర్గాల్లో కలుగుతోంది.