వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎదగడానికి పనిచేసిన అంశాల్లో సానుభూతి కూడ ఒకటి. ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆయన ఎదుర్కొన్న కష్టాలు అన్నీ కలిసి ఆయన మీద జనంలో బోలెడు సింపతీని క్రియేట్ చేశాయి. ఆ సింపతీని తన ఎదుగుదలకు మెట్లుగా వాడుకోవడంలో జగన్ నూటికి నూరు శాతం విజయవంతమయ్యారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణిస్తే అయ్యో.. జగన్ కొండంత అండ లాంటి తండ్రిని కొల్పోయారే అని బాధపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు సీఎం పదవి ఇవ్వకపోతే తండ్రి స్థానాన్ని కొడుక్కు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. బయటకొచ్చి సొంత పార్టీ పెడితే మన రాజన్న బిడ్డ మనమే తోడు నిలవాలి అనుకున్నారు.
ఇక అక్రమాస్తుల కేసులో ఆయన్ను జైలుకు పంపడం, అయన భార్యను సైతం విచారణ చేయడంతో జనం మరింత జాలిపడిపోయారు. చంద్రబాబు జగన్ ఎమ్మెల్యేలను లాగేసుకుని వైసీపీ ని విచ్ఛిన్నం చేయాలని అనుకోవడం, జగన్ పాదయాత్ర చేసి మనిషి మనిషిని పలకరించడంతో జనం ఇతనికి ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సిందేనని గట్టిగా నిర్ణయించుకుని గెలిపించేశారు. ఇలా సింపతీ జగన్ కెరియర్లో ప్రముఖంగా పనిచేసింది. ఇప్పుడు అదే సానుభూతి అంశాన్ని అస్త్రంగా మలుచుకుంటున్నారు జగన్. అధికారంలోకి వచ్చిన నాటి నుండి పలు అంశాల్లో ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. వాటిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ, మూడు రాజధానులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లాంటి కార్యక్రమాలు ఉన్నాయి.
వీటిని చూపించి జనం ద్రుష్టిని బాగా ఆకర్షించారు జగన్. వాటిని గనుక అములుపరచగలిగితే ఆయనకు ప్రజల్లో ఆదరణ మరింత పెరుగుతుంది. కానీ కోర్టుల ద్వారా వాటికి అడ్డుకట్ట పడుతోంది. ఏదో ఒక లోపం లేకపోతే అడ్డుకోవడం అసాధ్యం కదా. కానీ ఆ లోపాలను బయటపడనీయకుండా మేము మంచి చేయాలని అనుకుంటే చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు. ఆయనకు పేదలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం, సొంత ఇళ్లు కట్టుకోవడం, అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందడం ఇష్టం లేదు. అందుకే కోర్టులో కేసులు వేసి అడ్డంకులు సృష్టిస్తున్నారని జగన్ జనానికి చెబుతున్నారు. వైసీపీ శ్రేణులు ఈ అంశాన్ని గట్టిగా జనంలోకి పంపుతున్నారు. ఆశ్చర్యకరంగా జనం సైతం నిజమే కదా.. జగన్ మనకు మంచి చేయాలని అనుకుంటుంటే ఈ అడ్డంకులేమిటి. సీఎం అయినా ఆయనకు కష్టాలు తప్పట్లేదు అని అనుకుంటున్నారు. దీన్నిబట్టి ఆయన క్రియేట్ చేస్తున్న సింపతీ ఏ స్థాయిలో వర్కవుట్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు.